
- కొరియాలో బ్యాక్టీరియా నుంచి బయోడీగ్రేడబుల్ నైలాన్ తయారీ
- నాచుతో స్ట్రాలు, స్పూన్లు తయారు చేస్తున్న నార్వే సంస్థలు
- బయోప్లాస్టిక్స్పై విస్తృతంగా కొనసాగుతున్న పరిశోధనలు
హైదరాబాద్, వెలుగు: పండ్ల షాపు నుంచి కొన్న పండ్లను అవే పండ్లతో తయారు చేసిన క్యారీ బ్యాగుల్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది? కూరగాయలను పుట్టగొడుగుల నుంచి తయారు చేసిన బ్యాగుల్లో క్యారీ చేస్తే? కొబ్బరిబోండాలను నాచుతో తయారు చేసిన స్ట్రాతో తాగి.. ఆ స్ట్రానూ గుటకాయ స్వాహా చేస్తే..! అవును, అక్షరాలా ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయి. భూమి, చెరువు, సంద్రం అన్న తేడా లేకుండా భూగోళమంతా నిండి జీవాల ఉనికికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌కు ఫుల్ స్టాప్ పెట్టి.. భూమిలో వేగంగా కలిసిపోయే బయోప్లాస్టిక్స్తయారు చేసేందుకు ప్రపంచమంతటా పరిశోధనలు ఊపందుకున్నాయి.
ప్లాస్టిక్ కన్నా తేలికగా ఉండే.. ఎక్కువకాలం మన్నికనిచ్చే.. తక్కువ టైంలో భూమిలో కలిసిపోయే బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్స్ తయారీకి మన దేశంలోనూ ఐఐటీ గువాహటి, ఐఐటీ మద్రాస్‌లో కూడా రీసెర్చ్ లు నడుస్తున్నాయి. పలు సంస్థలు అందుకు అనుగుణంగా బయోప్లాస్టిక్స్ను ఉత్పత్తి చేసే పనిలో పడగా.. వాటికి ప్రోత్సాహాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వమూ విధివిధానాలనూ సిద్ధం చేసింది. అయితే, వాటిపై ఇప్పటికీ సరైన అవగాహన, ప్రచారం కల్పించకపోతుండడంతో ప్లాస్టిక్వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఈ బయోప్లాస్టిక్స్ వాడకంలోకి వస్తే పాలిథీన్ కవర్ల వినియోగం తగ్గడంతో పాటు.. భూసారం కూడా పెరిగేందుకు అవకాశాలు ఏర్పడతాయి.
చెరుకు పిప్పి, వరిగడ్డి నుంచి..
చెరుకు పిప్పి, వరి గడ్డి నుంచి భూమిలో అత్యంత తేలికగా కలిసిపోయే సెకండ్ జనరేషన్ బయోప్లాస్టిక్‌ను ఐఐటీ మద్రాస్‌లోని సెంటర్ ఆఫ్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్తయారు చేస్తున్నది. అంతేకాదు.. సూక్ష్మజీవుల నుంచి కూడా బయోప్లాస్టిక్స్ను (థర్డ్ జనరేషన్) ఉత్పత్తి చేసే పరిశోధనలను ముమ్మరం చేస్తున్నది. వ్యవసాయ వ్యర్థాలు, ఆల్గే (నాచు)ను ప్రాసెస్ చేసి పాలీ లాక్టిక్ యాసిడ్ (పీఎల్ఏ) అనే బయోప్లాస్టిక్స్తయారీపై దృష్టి సారించింది. అయితే, దానికి ఖర్చు కూడా విపరీతంగా అవుతుండడంతో.. ఉత్పత్తి ఖర్చును తగ్గించే పనిలో ఉన్నారు ఐఐటీ శాస్త్రవేత్తలు. ఈ రీసెర్చ్‌కు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్, పెట్రోకెమికల్స్ శాఖ ప్రోత్సాహం అందిస్తోంది.
వ్యవసాయ వ్యర్థాల నుంచి ప్రొటీన్ ఆధారిత ప్లాస్టిక్స్ తయారీపైనా ఐఐటీ మద్రాస్ ఫోకస్ పెట్టింది. హెర్నియా ప్యాచ్‌లు, ఒంట్లో కలిసిపోయే కుట్లు, ఇతర మెడికల్ ఇంప్లాంట్స్ కూడా తయారు చేస్తోంది. ఇక ఐఐటీ గువహటి కూడా ఇంట్లో ఉత్పత్తయ్యే వ్యర్థాల నుంచి బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ను 2019లోనే తయారు చేసింది. ఏడాదికి వంద టన్నుల చొప్పున బయోప్లాస్టిక్ తయారు చేసే ఈ ప్రాజెక్ట్‌కు కూడా కేంద్రం సహకారం అందించింది.
బ్యాక్టీరియా నుంచి నైలాన్ ప్లాస్టిక్
అచ్చం ప్లాస్టిక్లాగానే ఉండి.. భూమిలో అత్యంత వేగంగా డీగ్రేడ్ అయిపోయే నైలాన్‌ను ఓ బ్యాక్టీరియా నుంచి కొరియా సైంటిస్టులు తయారు చేశారు. కొరియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, కొరియా అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు.. బ్యాక్టీరియాలో సహజంగా జరిగే మెటబాలిక్ పాత్ వేస్ను ఉపయోగించుకుని ఓ మైక్రోబియల్ స్ట్రెయిన్‌ను డెవలప్ చేశారు. దానితో 9 రకాల బయోడీగ్రేడబుల్ పాలీఎస్టర్లను సృష్టించారు. దాంతో పాటు కర్ర మొద్దులు, నాచు నుంచి తీసిన గ్లూకోజ్‌ను వాడుకుని వీటిని ఉత్పత్తి చేశారు. ఒక లీటర్‌కు 54.57 గ్రాముల బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ను తయారు చేశారు. మామూలు ప్లాస్టిక్‌తో పోలిస్తే ఇది అత్యంత పటిష్ఠంగా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే దీనిని భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నారు.
పుట్టగొడుగుల ప్లాస్టిక్.. నాచుతో కట్లరీ
పుట్టగొడుగుల నుంచి అత్యంత పటిష్ఠమైన ప్లాస్టిక్ను తయారు చేశారు కెనడా, మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మనీతోబా, పంజాబ్‌లోని అంబేద్కర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు.. పుట్టగొడుగులలోని మైసీలియం(బూజు దారాల వంటివి), వ్యవసాయ వ్యర్థాలను వినియోగించి బయోఫోమ్ ప్లాస్టిక్ ఉత్పత్తి చేశారు. దీని పటిష్ఠత 78.53 నుంచి 153.59 కిలోగ్రామ్పర్ క్యూబిక్‌మీటర్ల మేర ఉన్నట్టు గుర్తించారు.
వరి, గోధుమ గడ్డి, పత్తి కట్టెలు, చెరుకు పిప్పిని బేస్‌గా వాడుకుని.. దానిని మైసీలియంతో ప్రాసెస్ చేశారు. అలాగే, నాచుతో బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ను తయారు చేసింది నార్వేకి చెందిన స్టార్టప్ బెజియోస్. 2018లో సముద్రంలోని నాచుతో తినేందుకు వీలుగా ఉండే స్ట్రా, చెంచాలు, చాక్లెట్ ప్యాకెట్లనూ ఉత్పత్తి చేసింది. ఈ ప్లాస్టిక్ 47 రోజుల్లోనే భూమిలో కలిసిపోతుంది. 2022లో నోట్‌ప్లా అనే సంస్థ కూడా కట్లరీతో పాటు కంపోస్ట్‌లా ఉపయోగపడే కంటెయినర్లను తయారు చేసింది. ఇవేకాదు.. చాలా దేశాల్లో పండ్లు, కూరగాయల నుంచి కూడా బయోప్లాస్టిక్స్తయారీకి పరిశోధనలు చేస్తున్నారు.
ప్లాస్టిక్ను బ్యాన్ చేసినా..
మన దేశంలో 40 మైక్రోగ్రాముల కన్నా తక్కువ పరిమాణమున్న ప్లాస్టిక్ను బ్యాన్ చేసినా.. విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్, కాటన్ బ్యాగులను ప్రమోట్ చేస్తున్నా వాటి వినియోగం అంతంతే. పేపర్ బ్యాగుల తయారీకి చెట్లను నరకాల్సి వస్తుండడంతో వాటిపై కొంత వ్యతిరేకతా వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ కన్నా అత్యంత మెరుగైన బయోప్లాస్టిక్ ఉత్పత్తులపై ఇప్పుడిప్పుడే ఆశలు రేకెత్తుతున్నాయి.
పెట్రోలియం నుంచి తయారయ్యే పాలిథీన్ కవర్లు, బాటిళ్లు భూమిలో కలిసిపోయేందుకు కనీసం వెయ్యేండ్లు పడుతుంది. కానీ, ఈ బయోప్లాస్టిక్స్ 30 నుంచి 60 రోజుల్లోపే భూమిలో కలిసిపోయి పర్యావరణానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. మన దేశంలో పలు కంపెనీలు దీనిపై ఇప్పటికే వర్క్ చేస్తున్నా.. ఆ కంపెనీలను చేతి వేళ్లపైనే లెక్కపెట్టుకోవచ్చు.
ఇవీ బయోప్లాస్టిక్ ఉపయోగాలు..
బయోప్లాస్టిక్ వాడకం వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. ప్లాస్టిక్ఉత్పత్తికి భారీగా కరెంట్ ఖర్చు అవుతుండగా, బయోప్లాస్టిక్ తో అది కూడా ఆదా అవుతుంది. వీటి వినియోగంతో భూమిలో కలసిపోని వ్యర్థాలు తగ్గిపోతాయి. థాలేట్స్, బిస్ఫినాల్ ఏ వంటి హాని చేసే రసాయనాలు బయోప్లాస్టిక్స్లో ఉండవు. ఫుడ్‌ను ప్యాక్ చేసినా వాటి ఫ్లేవర్, కలర్ మారవు. బయోప్లాస్టిక్స్ను మెడికల్ డివైజెస్ తయారీకి కూడా ఉపయోగించొచ్చు. ఫుడ్, మెడిసిన్స్ ప్యాకింగ్‌కు వాడొచ్చు.
వ్యవసాయ, హార్టికల్చర్‌లోనూ వినియోగించవచ్చు. ఇంట్లో వాడే పరికరాలకూ వాడుకోవచ్చు. పిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి అనువుగా ఉంటాయి. ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ సెక్టార్‌లోనూ ఉపయోగపడతాయి. కాగా, బయోప్లాస్టిక్స్లోనూ మూడు కేటగిరీలున్నాయి. బయోడీగ్రేడబుల్ కాని బయోప్లాస్టిక్స్ (రీసైకిల్ చేసుకోవచ్చు), శిలాజాల నుంచి తయారు చేసే బయోప్లాస్టిక్స్, వ్యవసాయ వ్యర్థాలు, సూక్ష్మజీవుల నుంచి తయారు చేసే బయోప్లాస్టిక్స్.