ఆ ప్రాంతంలో కొందరు రైతులు సరిపడా సంపాదన లేక తరతరాల నుంచి పేదరికంలోనే ఉంటున్నారు. కొందరైతే.. కుటుంబాలను వదిలి అవకాశాలను వెతుక్కుంటూ వలసలు వెళ్తున్నారు. వాళ్ల పేదరికం వల్ల అక్కడి పిల్లలు బాధితులుగా మారుతున్నారు. చాలామంది మధ్యలోనే చదువు మానేశారు. ఇదంతా చూసిన సత్యం భండారి, రోహిత్ నేగి, మోహిత్ రాణా.. అనే ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ల కోసం ‘ఫరేకా’ పేరుతో ఒక స్టార్టప్ పెట్టారు. అక్కడి రైతులకు చేయూత ఇచ్చేందుకు లాభాల్లో 50 శాతం వాటా ఇస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో హిమాలయాల దిగువన ఉన్న అందమైన టౌన్ అగస్త్యమునిలో పుట్టి పెరిగాడు సత్యం. అతను పుట్టడానికి ఆరు రోజుల ముందే తండ్రి చనిపోయాడు. దాంతో సత్యంని పెంచే బాధ్యత వాళ్ల అమ్మ మీద పడింది. సత్యం కోసం ఆమె చాలా కష్టపడేది. స్థానికంగా స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన సత్యం డెహ్రాడూన్‌లో బీఎస్సీ పూర్తి చేశాడు. 2018–19లో గాంధీ ఫెలోషిప్‌లో చేరాడు. ఆ నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ ఫెలోషిప్‌లో ఒక వ్యక్తి తనను తాను నిర్మించుకుని.. సమాజాన్ని, వ్యవస్థలను మార్చేలా చేసేందుకు ట్రైనింగ్ ఇస్తారు
.సత్యం ఆ ఫెలోషిప్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడే నేను అట్టడుగు వర్గాల పోరాటాలను నిజంగా అర్థం చేసుకున్నా. మధ్యప్రదేశ్‌లోని విదిషాలో పిరమల్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేశా. రైతులు, గిరిజనుల జీవితాలను చూశా. ఇక్కడివాళ్లు తమ పిల్లలను స్కూల్‌కు పంపడం కంటే రోజుకు రూ. 100 కూలీ కోసం పొలాల్లో పనికి పంపడమే మేలనుకుంటున్నారని తెలుసుకున్నా”అంటూ తన ఎక్స్‌పీరియెన్స్‌ని చెప్పాడు సత్యం. ఈ ఫెలోషిప్‌లో భాగంగానే అతను విదిషా జిల్లాలో ఒక గిరిజన కుటుంబంతో కలసి నెల రోజులు ఉన్నాడు. ఆ ఫ్యామిలీ యజమాని ఒక పెయింటర్. అతను సంపాదించేది అంతంతమాత్రమే. ఎక్కువగా ఫీల్డ్‌వర్క్ చేసేవాడు. దాంతో తొమ్మిదేళ్ల పెద్ద కొడుకు వాళ్ల అమ్మకు పొలం పనుల్లో సాయం చేసేవాడు. అందువల్ల చదువుకు దూరమయ్యాడు.
అతని రెండో కొడుకు వయసు ఆరేండ్లు. అతను తన చెల్లెలిని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసేవాడు. సత్యం ఒకరోజు సాయంత్రం ఆ ఫ్యామిలీతో ఉన్నప్పుడు అతనికి ఆకాశంలో ఎగురుతున్న విమానం కనిపించింది. దాన్ని చూడగానే సత్యం ‘‘మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణించారా? లేదంటే భవిష్యత్తులో ప్లాన్ చేస్తున్నారా?” అడిగాడు. దానికి ఆ కుటుంబ పెద్ద ‘‘అది ఈ తరంలో సాధ్యమయ్యే పని కాదు” అన్నాడు. ఆ క్షణమే రైతుల కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాడు సత్యం. ఆ ఫ్యామిలీతో ఉన్నప్పుడు సత్యంకు తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. తండ్రి లేకుండా తనను పెంచేందుకు వాళ్ల అమ్మ ఎంత కష్టపడిందో జ్ఞాపకం వచ్చింది.
బ్రాండ్‌గా..
వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో ఈ ముగ్గురూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత నిధులను సేకరించడం కష్టమైంది. పైగా ఈ బిజినెస్‌లో అనుభవం, అవసరమైన స్కిల్స్ లేవు. మార్కెటింగ్, సేల్స్ లాంటివి పూర్తిగా తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. పైగా వాళ్లు మొదటి డీల్లోనే మోసపోయారు. రైతుల దగ్గర నుంచి గింజలను కొనేందుకు 25 లక్షల రూపాయలు అప్పు చేశారు. 2022 జులైలో 300 -లీటర్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆర్డర్ వచ్చింది. అది వాళ్ల మొదటి ఆర్డర్. దాని విలువ సుమారు రూ. 6–7 లక్షలు. ఆ ఆర్డర్ ఎన్‌సిఆర్‌లోని నోయిడా నుంచి వచ్చింది. డెలివరీకి ముందురోజు రాత్రంతా ప్యాకింగ్, షిప్‌మెంట్ రెడీ చేశారు.
సరుకుతోపాటు డబ్బు తీసుకోవడానికి సత్యం కూడా వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ పనిచేయడం లేదని, మొదట రూ. 1.5 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. అతని మాటలు నమ్మిన సత్యం తిరిగి వచ్చేశాడు. కానీ.. ఆ వ్యాపారి మిగిలిన రూ.4 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వాళ్లు మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకుని బిజినెస్ చేశారు. 2023–24లో ఫరేకాకు రూ. 60 లక్షల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత బిజినెస్ బాగా పెరిగింది.
2024–25 మొదటి ఆరు నెలల్లోనే రూ. 1.3 కోట్ల బిజినెస్ జరిగింది. అది 2024–25 చివరి నాటికి రూ. 2.5 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్టార్టప్ నుంచి ముఖ్యంగా నల్ల ఆవాలు, పచ్చ ఆవాలు, పల్లీ నూనెలు ఎక్కువగా అమ్ముతున్నారు. రాబోయే మూడేళ్లలో 10,000 మంది రైతులను కలుపుకొని ఐదు రకాల నూనె గింజల ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వాటి ద్వారా 250 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు.
ఫ్రెండ్స్‌తో కలిసి
ఫెలోషిప్ పూర్తి చేసిన తర్వాత సత్యం సొంతూరికి వెళ్లిపోయాడు. అక్కడ తన స్కూల్‌మేట్స్, రోహిత్ నేగి, మోహిత్ రాణాలకు తన ఆలోచన గురించి చెప్పాడు. కాలేజీ రోజుల నుంచే ఈ ముగ్గురూ బిజినెస్ ప్లాన్ల గురించి మాట్లాడుకునేవాళ్లు. ముఖ్యంగా రైతుల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశం ముగ్గురిలోనూ ఉండేది. అందుకే ఉత్తరాఖండ్‌లో 2021లో ‘హార్ట్ ఇన్ హిల్స్’ పేరుతో ఒక స్టార్టప్ పెట్టారు. రోహిత్ సేల్స్, ఆపరేషన్స్ చూసుకుంటానన్నాడు.
ఈ వెంచర్ కోసం సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మోహిత్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. ముడి పదార్థాలను సేకరించడం, క్వాలిటీ చెక్ లాంటివి చూసుకున్నాడు. స్టార్టప్ పెట్టిన మొదటి ఏడాదిలో రూ. 3 లక్షల లాభాలు వచ్చాయి. ఈ స్టార్టప్ ద్వారా ఉత్తరాఖండ్‌లోని రైతుల నుండి మిల్లెట్స్ కొనేవాళ్లు. వాటిని దక్షిణ భారతదేశంలోని దిగుమతిదారులకు అమ్మేవాళ్లు. రైతులకు మార్కెట్ ధర కంటే 10–15 శాతం ఎక్కువ ధర చెల్లించేవాళ్లు. అయితే.. వాటిని తమ క్లయింట్స్‌కు అమ్మేముందు గ్రేడింగ్, క్లీనింగ్ తోపాటు ప్రైమరీగా ప్రాసెస్ చేసేవాళ్లు.
అలా చేసినందుకు కొంత ధర పెంచి అమ్మేవాళ్లు. ‘‘నేను 2020, 2021ల్లో హార్ట్ ఇన్ హిల్స్
ద్వారా రూ. 4 లక్షలు సంపాదించా. నా అప్పులు తీర్చుకోగలిగా. ఇంతకుముందు వ్యాపారులకు అమ్మేవాడిని. వాళ్లు నాకు ఎప్పుడూ సరైన ధర ఇవ్వలేదు”అని రుద్రప్రయాగ్ జిల్లా లూథియాగ్ గ్రామానికి చెందిన రైతు సుబ్దేయ్ చెప్పాడు. బిజినెస్ క్లోజ్
హార్ట్ ఇన్ హిల్స్ నడుపుతున్నప్పుడే పెద్ద ఎత్తున వెంచర్‌ను నడపడం అంత ఈజీ కాదని వాళ్లకు అర్థమైంది. ఈ స్టార్టప్ వల్ల లోకల్‌గా రైతుల నుంచి మిల్లెట్స్ కొనే కొంత మంది వ్యాపారుల బిజినెస్ తగ్గిపోయింది. దాంతో వ్యాపారులు అంతా కలిసి వీళ్లను బెదిరించారు. దాంతోపాటు మరికొన్ని సమస్యలు వచ్చాయి.
అందుకే కంపెనీ మూసేశారు. కానీ.. రైతులకు సాయం చేయాలనే ఆలోచన మాత్రం మార్చుకోలేదు. అందుకోసం మరో మార్గం వెతికారు. ముగ్గురూ కలిసి రీసెర్చ్ చేశారు. మన దేశంలో సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు వాళ్లు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌కు డిమాండ్ పెరుగుతుండడం గమనించారు. వెంటనే 2022 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో ‘ఫరేకా’ పేరుతో స్టార్టప్ పెట్టి.. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బుద్ధా ఇన్‌స్టిట్యూట్ అందించిన రూ. 22 లక్షల గ్రాంట్‌ని పెట్టుబడిగా పెట్టి, కంపెనీని విస్తరించారు.
50 శాతం వాళ్లకే..
స్టార్టప్ ద్వారా రైతుల నుంచి నేరుగా గింజలను కొని నూనె తీస్తున్నారు. అందుకోసం రాజస్థాన్‌లోని కరౌలి జిల్లా హిందౌన్‌లో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అందులోని కోల్డ్-ప్రెస్డ్ మెషీన్లను రైతులే మెయింటెయిన్ చేస్తున్నారు. ఫరేకా కో– ప్రాఫిట్ విధానంలో పనిచేస్తోంది. అంటే.. ఖర్చులు అన్నీ పోనూ మిగిలిన లాభాల్లో 50 శాతం వాటాను రైతులకు ఇచ్చేస్తున్నారు. రెండు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ భాగస్వామ్యంతో ముడిసరుకుని కొంటున్నారు.
ఈ మోడల్ రైతు వలసలను తగ్గించడానికి, స్థానికంగా ఉపాధిని సృష్టించడానికి సాయపడుతోంది. ‘‘కంపెనీ నా కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తును అందించింది. నేను గతంలో కుటుంబాన్ని పోషించ డానికి చాలా కష్టపడ్డాను. కానీ, ఫరేకాలో చేరిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వాళ్లు నేను పండించిన ఆవాలను మార్కెట్ కంటే ఎక్కువ ధరకు కొంటున్నారు. పైగా నాకు మెషీన్లు ఆపరేట్ చేయడం నేర్పించి, ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా పిల్లలను బాగా చదివిస్తున్నా” అని 42 ఏళ్ల రైతు రామావతార్ చెప్పారు.