ఇకపై తీర్పులు చెప్పలేను.. సంతృప్తిగానే రిటైరవుతున్నా: సీజేఐ చంద్రచూడ్ భావోద్వేగం

ఇకపై తీర్పులు చెప్పలేను.. సంతృప్తిగానే రిటైరవుతున్నా: సీజేఐ చంద్రచూడ్ భావోద్వేగం

న్యూఢిల్లీ:  న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కినవారికి సేవ చేయడం కంటే గొప్ప అనుభూతి ఏదీ ఉండదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘‘రేపటి నుంచి ఇక తీర్పులు చెప్పలేను. అయినప్పటికీ సీజేఐగా సంతృప్తిగానే పదవీ విరమణ చేస్తున్నా..” అని ఆయన ఎమోషనల్ అయ్యారు. సుప్రీంకోర్టు 50వ చీఫ్ జస్టిస్ గా చంద్రచూడ్ పదవీకాలం ఆదివారం నాటితో ముగియనుంది. శుక్రవారం చివరి వర్కింగ్ డే కావడంతో సుప్రీంకోర్టు జడ్జిలు, లాయర్లు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. 

కాబోయే సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సెరెమోనియల్ బెంచ్ కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయమూర్తిగా పూర్తి సంతృప్తితో విధులు నిర్వర్తించానని, దేశానికి ఇలా సేవ చేసే అవకాశం వచ్చినందుకు  సంతోషంగా ఉందన్నారు. ‘‘ఈ కోర్టే నన్ను నడిపించింది. ఏదో ఒకటి నేర్చుకోని లేదా సమాజానికి సేవ చేయని రోజు ఇక్కడ ఒక్కటి కూడా లేదు.

 మనకు కనీసం పరిచయం కూడా లేని, ఎన్నడూ కలవని వాళ్లకు కోర్టులో న్యాయం చేయడానికి మించిన గొప్ప విషయం ఇంకోటి ఉండదు. అయితే, మనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తుల జీవితాలను మనం తీర్పులతో ప్రభావితం చేస్తుంటాం కూడా..” అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. లా స్టూడెంట్ గా ఉన్నప్పుడు తాను సుప్రీంకోర్టు హాలులో చివరి వరసలో కూర్చుని చూసేవాడినని, ఇప్పుడు ఈ స్థానంలో ఉండి సేవ చేసే చాన్స్ దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. 

జస్టిస్ ఖన్నా చాలా సమర్థుడు.. 

తన తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టబోయే జస్టిస్ సంజీవ్ ఖన్నా చాలా సమర్థుడైన, అంకితభావంతో కూడిన న్యాయమూర్తి అని సీజేఐ చంద్రచూడ్ మెచ్చుకున్నారు. న్యాయమూర్తిగా తన ప్రస్థానంలో సహకారం అందించిన జడ్జిలు, అడ్వకేట్లు, అధికారులు, స్టాఫ్ అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోర్టులో అనుకోకుండా తాను ఏవైనా తప్పులు చేసినా లేదంటే మిస్ అండర్ స్టాండింగ్ చేసుకుని బాధపెట్టి ఉన్నా.. ప్రతి ఒక్కరూ తనను క్షమించాలని కోరారు. కాబోయే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. సీజేఐ చంద్రచూడ్ తన పనిని ‘ఈజీ అండ్ టఫ్’గా మార్చారని అన్నారు. 

సుప్రీంకోర్టులో ఆయన తెచ్చిన సంస్కరణలతో తన పని ఈజీ అవుతుందని, కానీ ఆయన దారిలో, అంతే సమర్థంగా కోర్టును నడపడం మాత్రం చాలా కష్టం అవుతుందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిల్ సిబల్ మాట్లాడుతూ.. గొప్ప తండ్రికి పుట్టిన గొప్ప కుమారుడు చంద్రచూడ్ అని కొనియాడారు. తాను 52 ఏండ్లుగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నానని, ఇంతటి ఓర్పుతో కూడిన జడ్జిని ఎన్నడూ చూడలేదన్నారు. 

ఎల్లుండి కొత్త సీజేఐగా ఖన్నా ప్రమాణం 

జస్టిస్ డీవై చంద్రచూడ్ (64) సుప్రీంకోర్టు 50వ చీఫ్​జస్టిస్ గా 2022, నవంబర్ 9న నియమితులయ్యారు. ఆదివారం నాటితో ఆయన రెండేండ్ల పదవీకాలం పూర్తి కానుంది. సోమవారం కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా (64) ప్రమాణం చేయనున్నారు. కాగా, సుప్రీంకోర్టుకు అత్యధిక కాలం చీఫ్ జస్టిస్ గా (1978 నుంచి 1985 వరకు) పని చేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడే సీజేఐ చంద్రచూడ్. తండ్రి అడుగు జాడల్లోనే న్యాయ విద్యను అభ్యసించిన ఆయనలాగే సీజేఐగా పదవీ విరమణ చేశారు.

సీజేఐగా సంస్కరణలు.. కీలక తీర్పులు 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తన పదవీకాలంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టడంతోపాటు పలు కీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు. దివ్యాంగులకు సాధికారత కల్పించే దిశగా సుప్రీంకోర్టు ఆవరణలో దివ్యాంగులతో నడిచే ‘మిట్టీ కేఫ్’ను ప్రారంభించారు. ఇక రెండేండ్ల పదవీకాలంలో సీజేఐ పలు కీలక తీర్పులు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని, 2024 సెప్టెంబర్ కల్లా జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతోపాటు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలన్న పిటిషన్ ను తిరస్కరించారు. అయితే, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి గౌరవంతో, స్వేచ్ఛగా, వివక్షారహితంగా బతికే హక్కు ఉంటుందని తేల్చిచెప్పారు. అలాగే వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్ల స్కీం రాజ్యాంగ విరుద్ధమని గత ఫిబ్రవరిలో సీజేఐ బెంచ్ తీర్పు చెప్పింది.

 ఏ పార్టీకి ఎవరు, ఎంత మొత్తంలో బాండ్లు కొన్నారో తెలియజేయాల్సిందేనని ఎస్బీఐని ఆదేశించింది. జైళ్లలో కుల వివక్ష సరికాదని ఇటీవల ఓ కేసులో విచారణ సందర్భంగా సీజేఐ బెంచ్ తేల్చిచెప్పింది. అలాగే ప్రైవేట్ ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కాబోవని కూడా సీజేఐ బెంచ్ ఇటీవల ఓ తీర్పులో స్పష్టం చేసింది. కొన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి మాత్రమే మినహాయింపు ఉంటుందని పేర్కొంది. 

నన్ను ట్రోల్ చేసినోళ్లకు ఇక పనుండదు..

దేశంలో అత్యధికంగా ట్రోలింగ్ కు గురైన జడ్జిని తానే కావచ్చని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ‘‘నేను ఇక పదవి నుంచి దిగిపోతున్నా. కానీ సోమవారం నుంచి ఏమవుతుందో ఏమో.. ఇన్నాళ్లూ నన్ను ట్రోల్ చేసినవాళ్లకు ఇక పని ఉండదు!” అని ఆయన చమత్కరించారు. కాగా, సీజేఐ చంద్రచూడ్ పై వివిధ సందర్భాల్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఇటీవల ఆయన వెన్ను నొప్పి కారణంగా తన కుర్చీని మార్చడంపైనా నెటిజన్లు సెటైర్లు వేశారు. దీనిపై ట్రోలర్లు చాలా దారుణంగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.