న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే ప్రవేశపెట్టినవి కాదని ప్రధాని మోడీ అన్నారు. మధ్యప్రదేశ్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మోడీ.. వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలపై దశాబ్దాలుగా చర్చలు, సంప్రదింపులు జరిగాయని గుర్తు చేశారు.
‘కొన్ని దశాబ్దాలుగా రైతులు చేస్తున్న డిమాండ్లే ఈ చట్టాలు. కావాలంటే ఇప్పటి పార్టీల మేనిఫెస్టోలు చూడండి. అన్నింటిలోనూ వీటి గురించిన హామీలు ఉంటాయి. వ్యవసాయంలో తీసుకొచ్చిన సంస్కరణలతో విపక్షాలకు సమస్య ఉంటుందని నేను భావించడం లేదు. అయితే ఈ సంస్కరణల విషయంలో వాళ్లు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం నెరవేర్చడమే వారి ప్రధాన సమస్యగా మారింది. అన్ని పార్టీలకు చేతులు జోడించి కోరుతున్నా.. ఈ సంస్కరణ విషయంలో మొత్తం క్రెడిట్ మీరే తీస్కోండి. అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలకు నేను క్రెడిట్ ఇస్తా. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిషన్ రిపోర్టుకు భయపడ్డారు. ఆ రిపోర్టులో సూచించిన రికమండేషన్స్‌ను మేం అమలు చేస్తున్నాం’ అని మోడీ పేర్కొన్నారు.