- అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే
- పాస్ బుక్ ఉన్నోళ్లందరికీ రుణమాఫీ వర్తింపు
- రేపు రూ.లక్ష వరకున్న లోన్ల మాఫీ
- లబ్ధిదారులతో రైతు వేదికల్లో సంబురాలు
- రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: భూమి పాస్‌బుక్‌పై పంట రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాస్‌బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని, కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై మంగళవారం సెక్రటేరియెట్‌లో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కుటుంబ నిర్ధారణకు మాత్రమే రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలే. రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయి. వారికి రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వం” సీఎం అని చెప్పారు. ‘‘ఈ నెల 18న లక్ష వరకున్న రుణాలను మాఫీ చేస్తాం. ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. అదేరోజు రైతు వేది కల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు నిర్వహించాలి. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. నేను హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబురాల్లో పాల్గొంటాను” అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో ఏకంగా రూ.31 వేల కోట్ల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామని పేర్కొన్నారు.
సెక్రటేరియెట్‌లో స్పెషల్ ఆఫీసర్లు..
ఈ నెల 18న ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంక ర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ‘‘రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతుల పంటరుణాల మాఫీకే బ్యాంకర్లు వినియోగించాలి. రైతుల వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దు. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్య లు తీసుకుంది. ఇప్పుడు కూడా బ్యాంకర్లు ఎవరైనా రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటం” అని హెచ్చరించారు.
‘‘రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. రుణమాఫీకి అర్హత ఉన్న ఏ ఒక్క రైతుకు అన్యా యం జరగకూడదు. కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దు” అని అన్నారు. రుణమాఫీకి సంబంధించి సెక్రటేరియెట్ లో రెండు జిల్లాలకో (ఉమ్మడి జిల్లాల చొప్పున) ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు ఉంటే వాళ్లను సంప్రదించాలని సూచించారు.