లాక్డౌన్ వల్ల చాలామంది వలస కార్మికులు ఎక్కడెక్కడో చిక్కకుపోయారు. వారంతా తమ సొంతూళ్లకు నడుచుకుంటునో, సైకిళ్ల మీదనో, లేకపోతే ఈ మద్యే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల ద్వారానో చేరుకుంటున్నారు. అలా వెళ్తూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది అయితే ఎండ వేడి భరించలేక మార్గమధ్యలోనే చనిపోతున్నారు.
అయితే తన దగ్గర పనిచేసే కార్మికులు ఇటువంటి కష్టాలు పడకూడదని భావించిన ఓ యజమాని.. వారందరిని విమానం సొంతూళ్లకు చేరేలా ఏర్పాట్లు చేశాడు. ఢిల్లీకి చెందిన పప్పన్ సింగ్ గెహ్లాట్ టిగిపూర్ గ్రామంలో పుట్టగొడుగుల పంటను పండిస్తున్నాడు. ఆ వ్యవసాయ క్షేత్రంలో 10 మంది బీహారీ వలస కూలీలు పనిచేస్తున్నారు. లాక్డౌన్ వల్ల వారంతా తమ సొంతూరైన బీహార్ లోని శ్రీపూర్ గహార్ కు వెళ్లడానికి శ్రామిక్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, వారికి సీట్లు కేటాయించలేదు. దాంతో ఇదే విషయాన్ని తమ యజమాని గెహ్లాట్ కు చెప్పారు. దాంతో ఆయన తన దగ్గర పనిచేసే వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్షరాల 68 వేలు ఖర్చుపెట్టి ఢిల్లీ నుంచి పాట్నాకు విమాన టిక్కెట్లు కొన్నాడు. ఆ తర్వాత వారందరికీ వైద్య పరీక్షలు చేయించి.. గురువారం ఉదయం విమానాశ్రయంలో దింపాడు. అంతేకాకుండా.. పాట్నా నుంచి తమ గ్రామానికి చేరుకోవడానికి బస్సు చార్జీలకు కావలసిన డబ్బును కూడా అందజేశాడు. వారంతా గురువారం విమానంలో పాట్నా చేరుకొని.. అక్కడి నుంచి బస్సులో శ్రీపూర్ గహార్ చేరుకుంటారు.
ఈ విషయంపై నవీన్ అనే కార్మికుడు మాట్లాడుతూ.. ‘మేం విమానం ఎక్కడం ఇదే మొదటిసారి. విమానం ఎక్కడమనేది మాకు ఆర్థికంగా కష్టమైన పని. ఇలా ప్రయాణిస్తామని ఎప్పుడూ అనుకోలేదు. నేను, నా తమ్ముడు ప్రవీణ్ విమానంలో వస్తున్నామని చెబితే మా తల్లి అసలు నమ్మలేదు. నా తండ్రి లఖ్వీందర్ రామ్ 27 సంవత్సరాలుగా గెహ్లాట్ దగ్గరే పనిచేస్తున్నారు. దాంతో మేం కూడా అక్కడే పనిచేస్తున్నాం.
మా యజమాని గత రెండు నెలలుగా మాకు కావలసిన ఆహారం ఏర్పాటు చేశాడు. మాకు లాక్డౌన్ వల్ల ఎటవంటి సమస్య రాలేదు. కానీ, మా కుటుంబ సభ్యులు మాత్రం మేం ఎలా ఉన్నామో అని ఆందోళన చెందారు. మేమంతా ఇంటికి తిరిగి రావాలని కోరుకున్నారు. కార్మికుల ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రమాదాల్లో మరణించినట్లు వార్తలు రావడంతో మా యజమాని మాకు విమాన టిక్కెట్లను బుక్ చేశాడు. మమ్మల్ని జాగ్రత్తగా విమానంలో పంపించిన మా యజమానికి కృతజ్ఞతలు. పుట్టగొడుగుల సీజన్ ప్రారంభంకాగనే మేమంతా ఆగస్టులో తప్పనిసరిగా తిరిగి వస్తాం’అని తెలిపాడు.
లక్షలాది మంది వలసకార్మికుల మాదిరిగా నా దగ్గర పనిచేసే కార్మికులు కూడా ఇబ్బందిపడకూడదనే నేను ఇలా చేశాను. వారు రోడ్డు మీద ఇబ్బందికర పరిస్థితులలో ప్రయాణించి ప్రమాదంలో పడకూడదని అనుకున్నాను. రైలు టిక్కెట్లను బుక్ చేస్తే.. సీట్లు కన్ఫర్మ్ కాలేదు. దాంతో విమాన ఖర్చులను భరించి వారిని సోంతూళ్లకు పంపాలని నిర్ణయించుకున్నాను. అందుకు ప్రతిఫలంగా నేను ఏమీ ఆశించను’అని యజమాని గెహ్లాట్ తెలిపారు.
For More News..