నల్గొండ జిల్లాలో పెట్రోల్ బాటిల్ తో ఓ రైతు ఆందోళనకు దిగాడు. చండూర్ సేవా సహకార సంఘంలో క్వింటాకి 10 కేజీల ధాన్యం కట్ చేస్తున్నారని ఆంజనేయులు అనే రైతు ధర్నా చేపట్టాడు. సెంటర్ లో అమ్మకున్న ధాన్యం బిల్లులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. మొత్తం బిల్లుపై రూ. 20వేల కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. 234 బస్తాలగాను 208 బస్తాలకు ట్రక్ షీట్ ఇచ్చారని.. మిగతా బస్తాలకు బిల్లులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
బిల్లులు అడిగితే సహకార సంఘం సీఈఓ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కార్యాలయ సిబ్బందితో ఆంజనేయులు వాగ్వాదానికి దిగాడు. తనకు న్యాయం జరిగే వరకు అక్కడినుంచి కదిలేదే లేదని ఆంజనేయులు కార్యాలయం ముందు భీష్మించుకొని కూర్చున్నాడు.