
జనగామ, వెలుగు : వడగండ్ల వాన నష్టం భరించలేక జనగామ జిల్లా చిటకోడూరులో ఓ రైతు అగ్రికల్చర్ఆఫీసర్ల ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వాన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆదివారం అగ్రికల్చర్ ఆఫీసర్లు చిటకోడూరుకు వచ్చారు. పలువురు రైతుల పొలాలను పరిశీలించిన తర్వాత సాదం భిక్షపతి అనే రైతు పొలాన్ని పరిశీలిస్తుండగా సదరు రైతు ఒక్కసారిగా పురుగుల మందు డబ్బా తీసుకుని పంట చేనులోకి పరుగెత్తాడు.
తాగేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న మిగతా రైతులు అప్రమత్తమై వెంటపడి మందు డబ్బాను గుంజుకున్నారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, భిక్షపతి 3 ఎకరాల్లో వరి వేయగా గింజ కూడా లేకుండా రాలిపోయింది. ఎకరాకు రూ.20 వేల చొప్పున సుమారు లక్షా 20 వేల వరకు పెట్టుబడి పెడితే.. ఇప్పుడు ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు చెప్పాడు. అకాల వాన బతుకును ఆగం చేసిందని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సర్కారు ఆదుకోవాలని కోరాడు.