పార్టీలు రైతులకు  ఏం చేస్తాయో రాసివ్వాలి: లక్ష్మీనారాయణ

నారాయణపేట, వెలుగు : వచ్చే ఎన్నికల్లో పార్టీలు అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తాయో చెప్పి బాండ్ పేపర్ పై రాసి సంతకం చేసి ఇవ్వాలని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కోరారు. రైతు చైతన్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధాన్యానికి మేకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని కడపలో ప్రయత్నించి సక్సెస్ అయ్యామన్నారు.

పంట నష్టాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు పరిహారాన్ని అందించాలన్నారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి జోడించాలన్నారు. రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు గోదాముల్లో నిల్వ ఉంచుకొని లోన్  తీసుకోవచ్చని తెలిపారు. రైతులకు ఇన్​పుట్ సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించాలన్నారు. కర్నాటకలో మాదిరిగా చెక్ డ్యాంలను నిర్మించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నారు. స్వామినాథన్ కమిషన్  సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు బంగ్లా సుదర్శన్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.