రైతు.. ఇప్పుడిక బిజినెస్ మ్యాన్

రైతు అంటే….పంటలు పండించేవాడిగానే చూడనక్కర్లేదిక

రైతు ఇకముందు ఓ బిజినెస్‌‌‌‌‌‌‌‌మ్యాన్ కూడా

పంటను తన ఇష్టప్రకారం మార్కెట్ చేసుకునే హక్కు వచ్చిందిప్పుడు

కావాలనుకుంటే, తన పొలాన్ని ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్​కు ఇవ్వొచ్చు, లేదంటే, పదిమందితో కలిసి ఒక కో ఆపరేటివ్ సొసైటీ పెట్టుకుని గ్రూప్​గా వ్యవసాయం, మార్కెటింగ్ చేయొచ్చు. అట్లనే, ఫలానా వస్తువులు నిల్వ చేయొద్దు, వెంటనే అమ్మేయమని ఎవరూ బలవంతపెట్టలేరు కూడా. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతు.. వ్యాపారిలా మారడానికి వీలయింది.

రైతుమీద కల్లబొల్లి ప్రేమ చూపించేవాళ్ళనే ఇన్నాళ్లూ చూశాం. రైతు ఎప్పటికీ రైతుగా ఉంటేనే ఇట్లాంటివాళ్ళ పబ్బం గడిచేది. వ్యవసాయం ఎప్పటికీ అట్లాగే ఉండాలని, వ్యాపారంగా మారకూడదన్నది వీళ్ళ ఉద్దేశం. అందుకే, ఓపెన్ మార్కెట్ తో రైతుకు లింకు లేకుండా చేశారు. వచ్చినకాడికి అమ్ముకుపోవాలనే ధోరణి అలవాటు చేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. రైతు నాలుగు డబ్బులు కళ్ళ చూసేలా చేయడానికి కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయి.

మూడు చట్టాలు

మూడురకాల వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ముందు పెట్టి సరేననిపించుకున్న నరేంద్రమోడీ సర్కారు వాటిని చట్టాలుగా మార్చి రైతుల ముందు ఉంచింది. రైతు బతుకు మార్చడానికే ఈ చట్టాలు. అయితే, ప్రైవేట్ కంపెనీలకు వ్యవసాయరంగాన్ని కట్టబెట్టడానికే కొత్త విధానం తెచ్చారని కొన్ని అపోజిషన్ పార్టీల వాదన. ఈ ఆరోపణలు కరెక్టో,కాదో కొత్త వ్యవసాయ చట్టాలు పరిశీలిస్తే అర్థమవుతుంది.

1. నిత్యావసరాలు కావిక!

ఈ బిల్లుల్లో మొదటగా పార్లమెంటు ఆమోదం పొందినది నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు (ఎసెన్షియల్ కమాడిటీస్ అమెండ్మెంట్ బిల్). ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, వంటనూనె గింజలు, పప్పుదినుసులు, చిరుధాన్యాలను నిత్యావసర సరుకుల జాబితానుంచి తొలగించే ఈ బిల్లు వల్ల వాటిపై కంట్రోళ్లు పోయాయి. కొత్త చట్టం ప్రకారం నిల్వ విషయంలో ఇంతకుముందున్న రూల్సు ఈ వస్తువులకు వర్తించవు. వీటిని జనం ఎక్కువగా వాడతారు కనుక, ఎక్కువ కాలం వీటిని నిల్వ చేయడానికి వీలులేకుండా ఇప్పటివరకు కట్టుబాట్లు అమల్లో ఉండేవి. నిత్యావసరాల జాబితాలో ఉండడంతో డిమాండ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– సప్లయ్ ఆధారంగా నిర్ణయాలుండేవి. ప్రభుత్వం చేతుల్లోనే కంట్రోల్ స్విచ్ ఉండేది. మార్కెట్లో సరుకు తగినంత లేకపోయినా, ధరలు మామూలుకన్నా ఎక్కువగా పెరిగినా రంగంలోకి దిగిపోయేవి ప్రభుత్వ ఏజెన్సీలు. ఫలితంగా

వీటిని ఎప్పటికప్పుడు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి రైతుది. దాన్ని పూర్తిగా మార్చడానికే.. ఈ బిల్లు తీసుకొచ్చింది మోడీ సర్కార్. నిత్యావసర సరుకుల జాబితానుంచి రోజువారీ సరుకుల్ని మినహాయించడంతో, ఇప్పుడిక రైతులు మంచి ధర వచ్చేవరకు వేచి చూసే అవకాశం కలిగింది. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధర కిలోకు 5 రూపాయలు కూడా లేని పరిస్థితులు మనం చూశాం. అట్లాగే, కిలో రూ.100, రూ.150కి కూడా అమ్మినరోజులూ మనకు తెలుసు. వాటిని నిల్వ చేసి….ఒక పద్ధతిలో మార్కెట్ లోకి తీసుకువచ్చే మెకానిజం ఉంటేనే రైతు లాభపడతాడు. కొత్త చట్టం ఇలాంటి  వీలు కల్పిస్తోంది.

విదేశీ పెట్టుబడులకు అవకాశం

ఈ చట్టంతో ఫుడ్ సప్లయ్ చెయిన్లో కార్పొరేట్, విదేశీ పెట్టుబడులకు అవకాశం ఏర్పడి గిడ్డంగులు, కోల్డ్​ స్టోరేజీ వంటి సౌకర్యాలు మెరుగుపడతాయి. ఈ విషయాల్లో రూల్సు అడ్డుపడకుండా చర్యలు తీసుకోడానికి కూడా వెసులుబాటు ఉంది. సప్లయ్ చెయిన్లు పెరిగితే ధరలు స్థిరంగా ఉంటాయి. పంట ఎక్కువొచ్చినా.. తక్కువొచ్చినా ధరల్లో ఎలాంటి హెచ్చుతగ్గులుండవు. దీనివల్ల ఇటు రైతులు, అటు వ్యాపారులకు లాభం కలుగుతుంది. ఈ చట్టంవల్ల ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి ఈ వస్తువులు వెళ్ళిపోతాయని, రేట్ల విషయంలో ఈ వ్యాపారులది ఆడిందే  ఆటగా ఉంటుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, మార్కెట్ లో డ్రామాలు నడుస్తుంటే  ప్రభుత్వం చూస్తూ కూర్చోదు. ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగి కంట్రోల్ చేస్తుంది.

2. ఒకే దేశం ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఒకే మార్కెట్

పార్లమెంటులో ఆమోదం పొంది చట్టాల్లా మారిన మరో రెండు వ్యవసాయ బిల్లుల విషయంలోనూ ప్రతిపక్షాలు లేనిపోని రభస చేస్తున్నాయి. ఇందులో ఒకటి….దేశమంతా ఒకే యూనిట్ లా మార్చి ‘ఒకే దేశం…ఒకే మార్కెట్’ అనే కాన్పెప్ట్ తో వచ్చిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం.

రైతు తన పంటను లోకల్ మార్కెట్ లోనే అమ్మాలనే సంకెళ్ళను కొత్త చట్టం తెంచేసింది. ఎక్కడ గిట్టుబాటయితే అక్కడ అమ్ముకునే వెసులుబాటు వచ్చింది రైతుకు. లోకల్ గా మంచి ధర వస్తుందనుకుంటే అక్కడే అమ్ముతాడు. లేదూ….ఇక్కడ అంతగా డిమాండ్ లేకపోతే, పొరుగు రాష్ట్రానికి  తీసుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటే కూడా అమ్ముకోవచ్చు. రాష్ట్రాల సరిహద్దుల దగ్గర చెక్ పోస్టుల్లో ఎవరూ ఆపరు.

ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి చెందిన మార్కెట్ యార్డులోనే అమ్ముకోవాలన్న పాత రూల్సును కొత్త చట్టం మార్చేసి, రైతును స్వేచ్చాజీవిని చేసింది. వీటన్నింటినీ మించింది ఏందంటే….మార్కెట్ లో రైతును దగా చేసే దళారీ వ్యవస్థ ఇకపై లేకుండా చేయడం. ఇన్నాళ్ళూ ఈ దళారీలే మార్కెట్​ను శాసించారు. పేరుకు మధ్య వర్తులే అయినా, వ్యాపారి దోపిడీకి వత్తాసు పలికి రైతుల పాలిట విలన్లే అయ్యారు.ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంటే, రైతుకు గిట్టుబాటు ధర రాకుండా ఎట్లా ఉంటుంది? ట్రాన్స్ పోర్ట్ పైసలు కూడా గిట్టక….గుండె రగిలిపోయి…. తెచ్చిన పంటనంతా రోడ్డుమీద పారబోసే దుస్థితి ఇకముందు ఉండదు. కొత్త చట్టం తెచ్చిన మరో వెసులుబాటు ఏంటంటే.. సరుకంతా మార్కెట్ దాకా మోసుకుపోనక్కర్లేదు. లారీలకూ, ట్రాక్టర్లకూ వేలరూపాయల్లో చార్జీలు సమర్పించనక్కర్లేదు. కళ్ళాల కాడనే అమ్ముకోవచ్చు. గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్​ల వద్దనే అమ్ముకునే అవకాశమూ ఉంది.

ఆన్ లైన్ లోనూ!

రైతుకు కూడా డిజిటల్ అడ్వాంటేజ్ ఇచ్చిందీ చట్టం. పంటను ఆన్ లైన్ లో అమ్ముకోవచ్చు. మార్కెట్ యార్డుల్లో గంటలతరబడీ, రోజుల తరబడీ వెయిటింగ్ కూడా అవసరంలేదు. అక్కడ నిద్రపోవడానికి కూడా జాగాలేక పంటమీదనే చద్దర్లు పరుచుకునే పాట్లు ఇక ఉండవు. వానొచ్చి పంటంతా తడిచిపోతుందేమో అనే దిగులే లేదు. ఇంటర్ నెట్ సెంటర్లో కూర్చుని ఏ మార్కెట్ లో ఎంత ధర ఉన్నదీ తెలుసుకుని, గిట్టుబాటు ధర వచ్చేచోటనే పంటను అమ్మకానికి పెట్టొచ్చు. అంటే…ఒక్క క్లిక్ తో, క్షణంలో పంటను అమ్మేయొచ్చు. ఏ పద్ధతిలో అమ్మినా కానీ, రైతులపై ఎట్లాంటి పన్నులు, చార్జీలు, ఫీజులు వేయకుండా కూడా కొత్త చట్టంలో ఒక క్లాజు చేర్చారు.

అదేరోజు పేమెంట్

ఒకే మార్కెట్ విధానం అమలైతే….ప్రైవేట్ కంపెనీలు తక్కువ ధరలకు పంటను కొనే ప్రయత్నాలు చేస్తాయంటూ  ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే, కంపెనీలే కనుక రంగంలోకి దిగితే, వాటి మధ్య ధరల పోటీ ఉంటుంది. అప్పుడు రైతుకు ఇంకా లాభం. తనకు ఎక్కువ ఆఫర్ చేసినవాళ్ళకే అమ్ముతాడు. అట్లాగే, పంటని రైతు అమ్మిన రోజునే అతనికి పేమెంట్ ఇచ్చేయాలి.

3. కాంట్రాక్ట్ ఫార్మింగ్

రైతు అడుగడుక్కీ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే. పంటకు పెట్టుబడి సమకూరుతుందో లేదోనన్న భయం, టైముకి తొలకరి వస్తుందో రాదోనన్న భయం. నాట్లు వేసే టైముకి నీళ్ళు అందుతాయో లేదోనన్న భయం, పంటకు చీడలు పడతాయేమోనన్న భయం, పంట చేతికందే సమయానికి ఏ తుఫానో, వరదలో వస్తాయన్న భయం.. ఇట్లా భయంభయంగానే గడుస్తుంది రైతుకు. వీటన్నింటికి చెక్‌‌‌‌‌‌‌‌పెట్టే సత్తా కాంట్రాక్ట్ ఫార్మింగ్ కు ఉంది. పంట సీజనుకు ముందే.. అంటే, దుక్కి దున్నకముందే రైతు ఎవరితోనైనా సరే కాంట్రాక్టు కుదుర్చుకుని సాగుకు దిగే వీలుకల్పించేందుకు ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ ఎష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ చట్టం కూడా వచ్చింది.

ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో పెట్టుబడి మొదలు, మార్కెటింగ్ వరకు రైతుకు ఎట్లాంటి తలనొప్పులూ ఉండవు. ఏదో ఒక  ప్రైవేట్ కంపెనీతో అతనో కాంట్రాక్టు కుదుర్చుకోవచ్చు. ప్రైవేట్ కంపెనీ చెప్పినట్టు నడుచుకుంటే చాలు, పెట్టుబడి కోసం బ్యాంకుల దగ్గరో, షావుకార్ల దగ్గరో అప్పు చేయనక్కర్లేదు. కంపెనీనే పెట్టుబడి పెడుతుంది. వానలూ వరదలూ వచ్చి పంట దెబ్బతిన్నా ఆ నష్టమంతా కంపెనీలే భరిస్తాయి. అగ్రిమెంట్ ప్రకారం రైతుకు డబ్బు ఇచ్చేయాలసిందే. దీంతో రైతుకు మినిమమ్ గ్యారంటీ. అప్పు ఉండదు. పైగా ఎంతోకొంత లాభంతో బయటపడొచ్చు. ఒక ఉద్యోగం చేసినట్టు.. అంతే! పంట బాగా పండి, మార్కెట్ కూడా అనుకూలిస్తే రైతుకు మరింత లాభం. ఆనాటి మార్కెట్ ధర ఎంతుంటే అంత రైతుకు కంపెనీ పేమెంట్ ఇవ్వాల్పి ఉంటుంది. అంటే, ఏరకంగా చూసినా రైతుకు నష్టమే ఉండదు.

ధర నిర్ణయంలో రైతు కూడా!

ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, హోల్​సేల్ వ్యాపారులు, పెద్ద పెద్ద రిటైల్ సంస్థలు, ఎక్స్​పోర్ట్ సంస్థలతో రైతులు నేరుగా కాంట్రాక్ట్ కుదుర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒప్పందం ప్రకారం ధర నిర్ణయించే ప్రాసెస్ లో రైతు కూడా పాల్గొంటాడు. పంట వేయడానికి ముందే ఆయా కంపెనీలనుంచి కనీస ధరపై గ్యారంటీ ఉంటుంది. కాబట్టి పంటను కొనే వ్యక్తే ఆ పంటపై ఉండే రిస్క్​ను భరించాల్సి ఉంటుంది.

తగాదాలు వస్తే….

ఈ అగ్రిమెంట్ల విషయంలో ఏవైనా తగాదాలు వస్తే వాటిని తీర్చడానికి ఒక మెకానిజం కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం కన్సిలియేషన్ బోర్డు ఏర్పాటవుతుంది. అగ్రిమెంట్లపై రెండుపక్షాల వాదనలను బోర్డు విని న్యాయం చేస్తుంది. బోర్డు నిర్ణయం నచ్చకపోతే, ఆర్డీవో స్థాయి ఆఫీసర్ దగ్గరకు ఇష్యూను తీసుకుపోవచ్చు. అక్కడా న్యాయం జరగలేదనుకుంటే కలెక్టర్ కు నివేదించొచ్చు. కలెక్టర్ చీఫ్ గా ఉండే అప్పిలేట్  అధారిటీ నెలరోజుల్లోగా తగాదా పరిష్కరించాల్సి ఉంటుందన్న రూల్ ను చట్టంలో చేర్చారు. ధరను నిర్ణయించడంలో రైతుకూ సమాన హక్కుండడమే కాదు. రైతులు ఎప్పుడు కావాలన్నా అగ్రిమెంట్ నుంచి తప్పుకోవచ్చు. దానికి ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఒకవేళ కార్పొరేట్ బయ్యర్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటే.. ఒప్పందం ప్రకారం ఆ మొత్తం పంట రేటును పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది.

10 వేల ఎఫ్పీవోలు

కార్పొరేట్లతో చిన్న సన్నకారు రైతులు డీల్ చేసుకునేలా దేశవ్యాప్తంగా 10 వేల ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీవో)ల ఏర్పాటు చేయాలని కూడా కొత్త చట్టంలో ఉంది.

ఈ సీను ఇక ఉండదు

ఎంతో శ్రమపడి టమాటాలు పండించి మార్కెట్​కు తెస్తే.. కిలో  5 రూపాయలు కూడా ధర లేని పరిస్థితి చాలా మామూలైపోయింది. దీనితో, కడుపు మండిన రైతు.. తెచ్చిన టమాటాలను రోడ్డుపైనే పారబోసిన సందర్భాలెన్నో. కొత్త చట్టం వల్ల టమాటాలు కానీ, అట్లా త్వరగా పాడైపోయే మరే పంటయినా కానీ.. ఇట్లా రోడ్డుపాలు చేయనక్కర్లేదు. గిట్టుబాటు ధర ఇచ్చే మార్కెట్ దేశంలో ఎక్కడున్నా సరే, అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. బక్క రైతు వేరే రాష్ట్రాలకు ఎట్లా తీసుకెళ్ళగలడని కొంతమంది అంటున్నారు. వేలమైళ్ళు కాకపోయినా, పొరుగు రాష్ట్రానికైతే తీసుకుపోగలడు కదా! ఉదాహరణకు, నిజామాబాద్ లో సరైన రేటు రాలేదనుకుంటే, మహారాష్ట్రలోని నాందేడ్ కు తీసుకుపోవచ్చు.

దళారులు ఉండరు

వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో దళారీల హవాను కొత్త వ్యవసాయ చట్టాలు సాగనివ్వవు. అదేందో కానీ, మార్కెట్ లో దళారీలు ఉండకూడదంటూ ఆందోళనలు చేసినవాళ్ళు ఇప్పుడు ఈ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కాదు. దళారీల అడ్డు తొలగిస్తే బాగుపడేది రైతే కదా!

కమీషన్ ఏజెంట్లగా పిలిచే ఈ దళారీల వ్యవస్థకు రాచముద్ర వేసిన పంజాబ్, హర్యానాల్లోనే ‘ఒకే దేశం – ఒకే మార్కెట్’ విధానంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. పంజాబ్, హర్యానాల్లో ఆ కమీషన్ ఏజెంట్లను ‘అర్హాతియాస్’ అని పిలుస్తారు. లోకల్ మార్కెట్ల లోనే రైతు పంటను అమ్మితే, కమీషన్ ఏజెంట్లకు పంట విలువపై 1.5 శాతం నుంచి 3 శాతం దాకా కమీషన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఆఫర్ చేసే కనీస మద్దతు ధర కన్నా తక్కువకూ పంటను దళారుల చేతుల్లో పెట్టాల్సి ఉంటుంది. అట్లనే, ధాన్యాన్ని మొత్తం సేకరించాక దళారులు ఎక్కువ రేటుకు పంటను అమ్ముకుంటారు.

అంతే కాదు, చాలా రాష్ట్రాల్లో కమీషన్ ఏజెంట్లే పంటకోసం రైతులకు అప్పులిస్తున్నారు. దీంతో రైతులు కమీషన్ ఏజెంట్లకే….వాళ్లు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. రైతుల నుంచి తక్కువ ధరకు కొని.. గోదాముల్లో దాచి.. తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు కమీషన్ ఏజెంట్లు.

మద్ధతు ధర ఉంటుంది

కొన్ని పంటలకు ప్రభుత్వం కనీస మద్దతుధర ప్రకటించడం మామూలు. కొత్త చట్టాల వల్ల ఇకముందు ఈ మద్ధతుధర పద్ధతి ఉండదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే, మద్దతుధర సిస్టమ్ ఉంటుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. వరి, గోధుమ పంటలకు మద్ధతుధరను పెంచుతామని చెప్పారు కూడా. అయితే, మద్దతు ధర విషయాన్ని చట్టంలో చేర్చాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. కానీ ఇట్లా మద్దతుధరను చట్టంలో పొందుపరిచే అవకాశం లేదు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా మద్దతు ధర క్లాజును ఏ చట్టంలో చేర్చలేదు. అవసరాన్ని బట్టి ప్రభుత్వం మద్ధతుధరను అప్పటికప్పుడు ప్రకటించడమే ఆనవాయితీ.

For More News..

మన బ్రహ్మోస్​ సక్సెస్

నవంబర్‌‌ 4 నుంచి మహిళల ఐపీఎల్‌‌ !

ఎవరు పడితే వాళ్లతో ఆస్తుల సర్వే