సన్నాలకు బోనస్​తోరైతుకు అదనపు ఆదాయం : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో సన్నాలు సాగు చేసిన ఒక్కో రైతుకు ఎకరానికి రూ.28వేల నుంచి రూ.31వేల వరకు ఆర్థిక సాయం అందుతుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సన్న వడ్లకు క్వింటాల్ రూ.500 బోనస్ ను రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకే దఫా పెద్ద ఎత్తున రూ.18వేల కోట్ల రైతు రుణ మాఫీని ప్రభుత్వం చేసిందని చెప్పారు. అంతే కాకుండా సన్న వడ్లకు బోనస్ ఇచ్చి సర్కారు రాష్ట్ర రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ బోనస్ ప్రకటన గొప్ప నిర్ణయం అని, సన్న వడ్లు సాగు చేసిన రైతులు అదనంగా అందుతున్న పైసలను పెట్టుబడికి వినియోగించుకోవాలని కోరారు. ఇందిరమ్మ పాలనలో రైతును రాజును చేస్తామన్న మాటను రేవంత్ ప్రభుత్వం నిలబెట్టుకుందని కోదండరెడ్డి స్పష్టం చేశారు.