అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆత్మకూరు (దామెర) వెలుగు: పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన వంగ రమేశ్ (40) తనకున్న ఒక ఎకరం ముప్పై గుంటల వ్యవసాయ భూమిలో పత్తి పంట వేశాడు. ఇందుకోసం పెట్టుబడి నిమిత్తం రూ. 3,50,000 అప్పులు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిని నష్టం వాటిల్లింది. పెట్టుబడి కోసం  చేసిన అప్పులు వాటికి మిత్తిలు కట్టలేక, పిల్లల చదువులకు ఇబ్బందులు, కుటుంబ పోషణ కష్టంగా మారడంతో రమేశ్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.  రమేశ్ భార్య  ఫిర్యాదు మేరకు దామెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.