బ్యాంక్​ ముందే పురుగుల మందు తాగిన రైతు

బ్యాంక్​ ముందే పురుగుల మందు తాగిన రైతు

 

  •     హనుమకొండ జిల్లా పరకాలలో దారుణం
  •     కోఆపరేటివ్​ బ్యాంక్​ ఆఫీసర్ల వేధింపులు
  •     పొలంలో జెండాలు పాతిన బ్యాంకు ఆఫీసర్లు
  •     పరువు పోతుందని ప్రాణాలు తీసుకున్న రైతు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, రేగొండ, వెలుగు: అప్పు కట్టాలంటూ బ్యాంకర్లు వేధించడంతో ఓ రైతు బ్యాంకు ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన జీవనాధారమైన భూమిని జప్తు చేస్తున్నట్లు ఆఫీసర్లు నోటీసులు ఇవ్వడంతోపాటు.. పొలంలో జెండాలు పాతడంతో రైతు అవమానంగా భావించి ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లా పరకాలలో మంగళవారం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తికి చెందిన పల్లెబొయిన రమేష్(50) తనకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. పంట సాగు కొసం 5 ఏండ్ల క్రితం హనుమకొండ జిల్లా పరకాల కోఆపరేటివ్(డీసీసీబీ) బ్యాంకులో తన భార్య మల్లక్క పేరిట ఉన్న భూమిపై మార్ట్ గేజ్ కింద రూ. 5 లక్షల రుణం తీసుకున్నాడు. గడువు ముగిసినా.. రమేశ్ అప్పు చెల్లించకపోవడంతో వడ్డీతో రూ.8 లక్షల వరకు కట్టాలని బ్యాంకర్లు నోటీసులు ఇచ్చారు. అప్పు చెల్లించకపోతే కుదవ పెట్టిన భూమిని అమ్ముతామని బ్యాంకర్లు వార్నింగ్‌‌‌‌ ఇచ్చారు. పరకాల డీసీసీబీ మేనేజర్ తిరుపతి, నోడల్ ఆపీసర్ జయప్రకాశ్ ఆధ్వర్యంలో రమేశ్ భార్య మల్లక్క పేరిట ఉన్న వ్యవసాయ భూమిని ఈ నెల 29న వేలం వేస్తున్నట్లుగా గ్రామంలో కర పత్రాలు పంచి పెట్టారు. రైతు వ్యవసాయ భూమిలో జెండాలు పాతారు. బ్యాంకు ఆఫీసర్ల తీరుతో అవమానంగా భావించిన రమేశ్ మంగళవారం పరకాల డీసీసీబీ వద్దకు చేరుకొని అక్కడే పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రైతు‌‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతుడికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

పంట నష్టంతో..
రైతు రమేశ్‌‌‌‌కు రేగొండ మండలంలోని కనిపర్తిలో మూడున్నర ఎకరాలు, లింగాలలో ఎకరంన్నర భూమి ఉంది. వీటిలో మూడున్నర ఎకరాల్లో మిర్చి వేయగా మిగిలిన భూమిని కౌలుకు ఇచ్చాడు. మిర్చి పంటపై ఈ ఏడాది రూ.2 లక్షలకు పైగా అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. తీరా తెగుళ్లు సోకి పంట పోయింది. దీంతో అప్పులే చెల్లించలేకపోగా ఈ క్రమంలో తమ అప్పు కట్టాలంటూ డీసీసీబీ బ్యాంకు  వాళ్ల వేధింపులు పెరిగాయి. ఏం చేయాలో తోచక పరువు కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.