నష్టపరిహారం రావట్లేదని రైతు ఆత్మహత్య.. హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఘటన

నష్టపరిహారం రావట్లేదని రైతు ఆత్మహత్య.. హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఘటన

హసన్ పర్తి, వెలుగు: హైవే కింద పోయిన భూమికి నష్టపరిహారం రాకపోవడంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. సీఐ చేరాలు తెలిపిన ప్రకారం.. హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన రైతు గొర్రె సారయ్య(57) కు గ్రామ శివారులో సర్వే నం.63/ఏ లో 32 గుంటల భూమి ఉంది. అందులోంచి ఎన్ హెచ్ – 563 రింగ్ రోడ్డు పోవడంతో  సారయ్య 32 గుంటల భూమిని కోల్పోయాడు. 

ప్రభుత్వ విలువ మేరకు సారయ్యకు రూ. 32 లక్షలు రావాల్సి ఉండగా,  ఏడాది నుంచి రెవెన్యూ ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేదు. దీంతో మనస్తాపం చెంది గురువారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ 
చేరాలు తెలిపారు.