అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి తండాలో సోమవారం అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లి తండాకు చెందిన రైతు జటావత్ కృష్ణ(40) 10 ఎకరాల్లో వ్యవసాయం చేశాడు. సాగునీటి కోసం బోర్లు వేయించగా నీళ్లు పడకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. దీంతో వ్యవసాయం కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి.

అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురైన కృష్ణ సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మండల పరిధిలోని పెద్దగూడెం స్టేజీ సమీపంలో పురుగులమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమివ్వడంతో వారు ఆయనను సాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్​కు తరలిస్తుండగా చనిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉంది.