- భద్రాద్రి జిల్లా జగన్నాథపురం ఏపీజీవీబీ వద్ద ఘటన
ములకలపల్లి,వెలుగు : బ్యాంకు ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం.. ములకలపల్లి మండలం మోటుగూడెం గ్రామానికి చెందిన బుడిపుటి వెంకటేశ్వర్లు ఆంధ్రాలో కరెంటు పనులకు వెళ్లి సంపాదించిన రూ.13వేలు నగదును అదే మండలంలోని జగన్నాథపురం ఏపీజీవీబీలో తన భార్య సుజాత అకౌంట్ లో జమ చేశాడు. దసరా పండుగ సందర్భంగా డబ్బులు డ్రా చేసుకునేందుకు ఐదు రోజుల కింద దంపతులు బ్యాంకుకు వెళ్లారు.
పొదుపు సంఘంలో సుజాత అప్పు ఉందని, అందుకే ఆమె అకౌంట్ హోల్డ్ లో పెట్టామని బ్యాంకు మేనేజర్ నరేశ్తెలిపాడు. ఐదురోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా మేనేజర్ పట్టించుకోవడంలేదు. సోమవారం మరోసారి దంపతులు బ్యాంకుకు వెళ్లగా మేనేజర్ లేకపోవడంతో ఫీల్డ్ ఆఫీసర్ ను కలిసి అకౌంట్ హోల్డ్ తీయాలని కోరారు. స్త్రీ నిధిలో సుజాత అప్పు పడిందని, ఆమె అకౌంట్ హోల్డ్ లో పెట్టాలని గ్రామ దీపిక రాజేశ్వరి చెప్పిందని ఫీల్డ్ ఆఫీసర్ చెప్పి.. హామీ పత్రం ఇవ్వాలని దంపతులకు చెప్పడంతో రాసిచ్చారు.
అదేవిధంగా ఏపీఎం సంపత్ ను కూడా వివరణ కోరగా స్త్రీనిధిలో రెండేళ్ల కింద సుజాత రూ.40వేలు అప్పు తీసుకుందని, దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తామని సమాధానం ఇచ్చారు. అనంతరం తనకు న్యాయం జరగడం లేదని వెంకటేశ్వర్లు బ్యాంకులోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు వచ్చి కాపాడారు. చివరకు బ్యాంకు అధికారులు సుజాత అకౌంట్ ను హోల్డ్ నుంచి తీశారు. తాము అప్పుకట్టామని అయినా మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, వీవో నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని బాధిత దంపతులు ఆరోపిస్తూ వాపోయారు.