ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంకులో రైతు ఆత్మహత్య

  • ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఘటన

ఆదిలాబాద్, వెలుగు:  అప్పు చెల్లించాలని బ్యాంక్​ సిబ్బంది వేధించడంతో ఓ రైతు అదే బ్యాంకులో అందరి ముందు పురుగు మందు తాగి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐసీఐసీఐ బ్యాంకులో శనివారం జరిగింది. బేల మండలం రేణిగూడకు చెందిన జాదవ్‌‌ దేవ్‌‌రావు (60) నాలుగేండ్ల కింద తనకున్న రెండున్నర ఎకరాల భూమిని మార్టిగేజ్‌‌ చేసి ఐసీఐసీఐ బ్యాంక్‌‌లో రూ. 3.40 లక్షల లోన్‌‌ తీసుకున్నాడు. ఆరు నెలలకోసారి రూ.25 వేల చొప్పున కిస్తీలు చెల్లిస్తున్నాడు.

ఆర్థిక పరిస్థితి సరిగ్గాలేకపోవడంతో గత రెండు కిస్తీలు చెల్లించలేదు. దీంతో ఇటీవల బ్యాంక్‌‌ సిబ్బంది రేణిగూడ గ్రామానికి వెళ్లి అప్పు కట్టాలని జాదవ్‌‌ దేవ్‌‌రావుతో వాగ్వాదానికి దిగారు. మనస్తాపానికి గురైన జాదవ్‌‌ దేవ్‌‌రావు శనివారం బ్యాంక్‌‌కు వచ్చి.. అప్పటికే తనతో తెచ్చుకున్న పురుగు మందును అందరి ముందే తాగాడు. తర్వాత తన కుమారుడు ఆకాశ్‌‌కు ఫోన్‌‌ చేసి విషయం చెప్పాడు. సెక్యూరిటీ కుర్చీలో ఐదు నిమిషాల పాటు కూర్చొని అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న జాదవ్​ బంధువులు అక్కడికి వచ్చి.. రిమ్స్​కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

కూతవేటు దూరంలో దవాఖాన ఉన్నా..!

బ్యాంక్‌‌కు రిమ్స్‌‌ కూతవేటు దూరంలోనే ఉందని, పురుగు మందు తాగిన వెంటనే బ్యాంక్‌‌ సిబ్బంది స్పందించి హాస్పిటల్‌‌కు తరలిస్తే జాదవ్​ దేవ్‌‌రావు బతికేవాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు జాదవ్​ బ్యాంక్​ కౌంటర్​ ముందు పురుగు మందు తాగుతున్న దృశ్యాలు.. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి సెక్యూరిటీ గార్డు కుర్చీలో కూర్చొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దాదాపు ఐదు నిమిషాల పాటు కుర్చీలోనే జాదవ్​ అల్లాడిపోయాడు. ఆ దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి.

పక్కనే హాస్పిటల్​ ఉన్నా.. బ్యాంక్​ సిబ్బంది తరలించకపోవడం ఏమిటని మృతుడి బంధువులు, స్థానికులు మండిపడ్డారు. రెండు కిస్తీలు కట్టనందుకే ఇంటికి వచ్చి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ. కోట్లు తీసుకున్న బడా వ్యాపారులకు నోటీసులు ఇచ్చే బ్యాంకర్లు.. రైతుల విషయంలో కఠినంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.

మృతుడి ఫ్యామిలీకి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు బ్యాంక్‌‌ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌ బ్యాంక్​ సిబ్బందితో చర్చించారు. రైతు తీసుకున్న లోన్‌‌ మాఫీ చేయడంతో పాటు మార్టిగేజ్‌‌ చేసిన పొలాన్ని తిరిగి ఇస్తామని, అతడి కుమారుడికి బ్యాంక్‌‌లో జాబ్‌‌ ఇస్తామని బ్యాంక్​ సిబ్బంది హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.