
న్యూఢిల్లీ: భారత్ బంద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీ, హర్యానా బోర్డర్‌లోని సింఘూ ప్రాంతంలో నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు మరణించాడు. అతడి మృతికి కారణం హార్ట్ అటాక్ అని పోలీసులు తెలిపారు. బాధితుడిని పంజాబ్‌లోని ఖేలా గ్రామానికి చెందిన 55 ఏండ్ల రైతు బఘేల్ రామ్‌గా గుర్తించారు. ఆయన కీర్తి కిసాన్ యూనియన్‌లో సభ్యుడిగా ఉన్నారు. సింఘూ బోర్డర్‌లో రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతం నుంచి తమకు సమాచారం రాగానే వేగంగా అక్కడికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. బఘేల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారని అన్నారు. అతడి మృతికి కారణంగా గుండె పోటు అని పోస్టుమార్టంలో తేలిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో రైతు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హైవేలను, రైల్వే ట్రాక్‌లపై నిరసనకారులు చేరి ఆందోళనలు చేశారు. దీంతో ట్రాఫిక్, రైళ్లు ఎక్కడికక్కడ బంద్ అయ్యాయి. ఇక సాయంత్రం 4 గంటల తర్వాత బంద్‌ను ఉపసంహరిస్తున్నట్లు నిరసనకారులు ప్రకటించారు. దేశమంతటా ఈ భారత్ బంద్ కార్యక్రమం సక్సెస్ అయిందని రైతు నేత రాకేశ్ తికాయత్ ప్రకటించారు. ఎక్కడా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదని, బంద్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు.