కాలువ నీటి విషయంలో గొడవ.. పురుగుల మందు తాగిన రైతు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: పొలం వద్ద కాలువ నీటికి సంబంధించిన గొడవతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం రత్నంపేటకు చెందిన గురిజాల చంద్రశేఖర్ (53) కు అదే గ్రామానికి చెందిన ఏడిగె మల్లేశానికి పొలం వద్ద కాలువ నీటి విషయమై గొడవ జరిగింది. దీంతో మల్లేశం...చంద్రశేఖర్ పై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. బోయిన్​పల్లి ఎస్ఐ మహేందర్​జులై మొదటివారంలో ఇద్దరిని పిలిపించి మాట్లాడి పంపించారు. అయితే, ఈ నెల ఆగస్టు1న చంద్రశేఖర్ సిరిసిల్లకు వచ్చి కోర్టు ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో పురుగుల మందు తాగాడు. దీంతో పోలీసులు చంద్రశేఖర్ పై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి  ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ గురువారం కన్నుమూశాడు. అయితే, ఆగస్టు1న చంద్రశేఖర్ తన చావుకు కారణం బోయిన్​పల్లి ఎస్ఐ, ఏఎస్ఐ బాబు, ఏడిగె మల్లేశం, గురిజా శ్రీధర్ కారణం అని ఓ పేపర్​పై రాశాడు. ఇవి సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. తను చనిపోతున్నాను కాబట్టి తన కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని  రాశాడు. గురువారం చంద్రశేఖర్​మరణించడంతో ఆయన బంధువులు చంద్రశేఖర్ మరణానికి కారణం ఏడిగె మల్లేశం అని అంటూ సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్​ చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.