అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జమ్మికుంట, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బావిలాల గ్రామానికి చెందిన సూదుల సంపత్(57) అనే రైతు తనకున్న మూడెకరాల్లో వరి, పత్తి వేశాడు. పత్తికి ధర లేక తక్కువ రేటుకే అమ్ముకున్నాడు. అకాల వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతినింది. గతంలో చేసిన అప్పులతో పాటు ప్రస్తుత పంట పెట్టుబడికి చేసిన అప్పులు రూ.15 లక్షలకు పెరిగాయి. వీటిని ఎలా తీర్చాలోనన్న బెంగతో పాటు భార్య సమ్మక్క అనారోగ్యం కూడా అతన్ని మానసికంగా కుంగదీసింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంపత్‌‌‌‌‌‌‌‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.