పాలమూరులో రైతు పండుగ

మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రుణమాఫీ చేసింది. దీని ద్వారా ప్రతి నియోజవర్గంలో 20 వేల నుంచి 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్‌‌ ‘రైతు పండుగ’  నిర్వహించేందుకు సిద్ధమైంది. మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కేంద్రం సమీపంలోని భూత్పూర్‌‌ వద్ద మూడు రోజుల పాటు రైతు సదస్సులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గురువారం జరగనున్న కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌రావు చీఫ్‌‌గెస్ట్‌‌గా హాజరై సదస్సును ప్రారంభించనుండగా, శనివారం నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్‌‌రెడ్డి హాజరవుతారు. స్టాల్స్‌‌ను పరిశీలించిన అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతారు.

లక్ష మంది రైతులు వచ్చేలా ఏర్పాట్లు

పాలమూరు జిల్లాలో గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్ర స్థాయి రైతు సదస్సులు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు సుమారు లక్ష మంది రైతులు హాజరయ్యేలా ప్లాన్‌‌ చేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని రైతులను మొబిలైజేషన్‌‌ చేస్తున్నారు. సదస్సుకు రైతులను తరలించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చుతున్నారు. సదస్సుకు వచ్చే రైతులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన రైతులకు శాస్ర్తవేత్తల ఆధ్వర్యంలో వివిధ రకాల పంటలు, వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించనున్నారు. 

ఇందుకు కోసం 300 మంది కూర్చునేలా హాల్స్‌‌ను, ఎల్‌‌ఈడీ మానిటర్లను సిద్ధం చేశారు. ఏ పరికరం ఎందుకు పనికొస్తుంది ? కొత్త రకం విత్తనాలు ఏమేమి వచ్చాయి ? చీడపీడల నివారణ ఎలా ఉంటుంది ? అనే దానిపై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించనున్నారు. మొదటి రోజైన గురువారం  నిర్వహంచే సదస్సుకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఐదు వేల మంది రైతులు పాల్గొననుండగా.. రెండో రోజు శుక్రవారం నిర్వహించే సదస్సులో సమీప జిల్లాలకు చెందిన మరో ఐదు వేల మంది రైతులు పాల్గొంటారు. చివరి రోజు రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి లక్ష మంది రైతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రైతు వేదికల్లో లైవ్‌‌ షో

పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రైతు సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఏర్పాట్లు చేస్తోంది. సదస్సుకు హాజరుకాని రైతుల కోసం రాష్ట్రంలోని 560 రైతు వేదికల్లో లైవ్‌‌ షోలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సదస్సులో మూడు రోజుల పాటు ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్య తదితర రంగాలకు చెందిన విజయగాథలపై వీడియో ప్రదర్శనలు ఉండనున్నాయి. వీటిని రైతు వేదికల్లో కూడా లైవ్‌‌ టెలికాస్ట్‌‌ చేయనున్నారు. ఒక్కో పంటకు సంబంధించి ఒక్కో ఆదర్శ రైతును గుర్తించి వారి అనుభవాలు సదస్సులో వివరించనున్నారు. 

ALSO READ : మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ భూముల్లో.. ఇదే ఆఖరు పంట

36 ఎకరాలు.. 150 స్టాళ్లు

మహబూబ్‌‌నగర్‌‌ సమీపంలోని భూత్పూర్‌‌ వద్ద రైతు సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుకోసం 36 ఎకరాల్లో సభా  ప్రాంగణం, స్టాల్స్, టెంట్లు ఏర్పాటు చేశారు. స్టాల్స్‌‌ ఏర్పాటు కోసమే ఐదు ఎకరాలను కేటాయించగా, మొత్తం 150 స్టాల్స్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 60 స్టాల్స్​వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినవి కాగా, 30 స్టాళ్లు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకు సంబంధించినవి, 20 స్టాల్స్‌‌ను హార్టికల్చర్‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. మిగతా స్టాల్స్‌‌ను పశుసంవర్ధక శాఖ, బ్యాంకర్లు, మార్కెటింగ్‌‌, వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు.