వేటగాళ్ల ఉచ్చుకు రైతు బలి

వేటగాళ్ల ఉచ్చుకు రైతు బలి

ములుగు, వెలుగు : ములుగు మండలం పెగడపల్లి శివారులో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు అమర్చిన కరెంట్​తీగలు తగిలి ఓ రైతు చనిపోయాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెగడపల్లికి చెందిన మీనుగు సాంబయ్య (42) మంగళవారం రాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకు భార్య మణెమ్మతో కలిసి వెళ్తున్నాడు. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ ​తీగలు తగిలి షాక్ ​కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని భార్య మణెమ్మ, గ్రామస్తుల సాయంతో ములుగు ఏరియా దవాఖానకు తరలించింది.

అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. సాంబయ్యకు ఇద్దరు బిడ్డలుండగా, పెద్ద బిడ్డ పెండ్లి చేశాడు. ములుగు సీఐ రంజిత్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు, విద్యుత్ ఏఈ సాయికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. వన్యప్రాణులను వేటాడడం కోసం కరెంట్​ తీగలు అమర్చిన ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

నాగర్​కర్నూల్ జిల్లా లింగాల మండలంలో...   

లింగాల : అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంట్​ వైర్లు తగిలి ఓ రైతు చనిపోయాడు. నాగర్​కర్నూల్  జిల్లా లింగాల మండలం కొత్త చెరువు తండాకు చెందిన రైతు సామ్యా నాయక్(65) తన చేనును అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు కరెంట్ తీగలు ఏర్పాటు చేశాడు. బుధవారం తెల్లవారుజామున  తొలగించడానికి వెళ్లి షాక్​ కొట్టడంతో చనిపోయాడు. మధ్యాహ్నం అవుతున్నా సామ్యానాయక్​ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా చనిపోయి కనిపించాడు. మృతుడికి భార్య పండుతో పాటు ఐదుగురు పిల్లలున్నారు.