
న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆదివారం దీక్షను విరమించారు. 131 రోజుల తర్వాత ఆయన తన దీక్షకు ముగింపు పలికారు. రైతుల నుంచి భారీగా వినతులు వస్తుండడంతో దల్లేవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ లోని ఫతేహ్ గఢ్ సాహిబ్ జిల్లా సర్ హింద్ లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ లో దల్లేవాల్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఆందోళనను ముందుకు తీసుకెళ్లిన రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘దీక్ష విరమించాలని మీరందరూ (రైతులు) నన్ను అడుగుతున్నారు. మీ సెంటిమెంట్లను నేను గౌరవిస్తాను. మీ సూచనలు, విజ్ఞప్తి మేరకు నా దీక్షను విరమిస్తున్నా” అని దల్లేవాల్ పేర్కొన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ కూడా దీక్ష విరమించాలని దల్లేవాల్ ను కోరారు.