కట్‌ఆఫ్ డేట్ 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబరు 11
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాల మాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష రూపాయలకు మించకుండా స్వల్పకాలిక పంట రుణాలకు మాఫీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే బంగారం తాకట్టుపై గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్న పంట రుణాలకు కూడా రుణమాఫీని వర్తింపజేసింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయనున్నారు. రైతు కుటుంబం అంటే భర్త, భార్య వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు.
2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబరు11 మధ్య కాలంలో రైతులు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలిపి లక్షకు మించకుండా అర్హులైన వారందరికి పథకం వర్తింపజేస్తారు. రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ పోర్టల్ ద్వారా డేటా కలెక్షన్ చేసి రుణమాఫీ లబ్ధిదారులను గుర్తించనున్నారు. తొలిదశలో రూ.25 వేలలోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తారు. మిగతా లక్ష వరకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. బ్యాంకుల ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ చార్జీలు, ఇన్సూరెన్స్, ఇన్‌స్పెక్షన్ చార్జీలు రుణమాఫీ పరిధిలోకి రావని వెల్లడించింది.
వీటికి వర్తించదు
ఉద్యాన పంటలకు అడ్వాన్స్ రూపంలో తీసుకునే రుణాలకు మాఫీ వర్తించదు. అదే విధంగా రీషెడ్యూల్ చేసిన రుణాలు, టై అప్ లోన్స్, మూసేసిన క్రాప్ లోన్ అకౌంట్స్, రిటెన్ ఆఫ్ రుణాలకు జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీ రుణాలు రీస్ట్రక్చర్డ్, రీషెడ్యూల్ రుణాలకు తాజా రుణమాఫీ వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకుల్లో, వాటి బ్రాంచ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా వాటిలో తీసుకున్న బంగారు రుణాలు మాఫీకి వర్తించవు.
అమలు మార్గదర్శకాలు ఇలా
రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు ఒక ఐటీ వ్యవస్థ లేదా పోర్టల్‌ను వ్యవసాయ శాఖ తయారు చేయాల్సి ఉంటుంది. రైతుల సమాచారం కోసం, వారి రుణాల మొత్తం వంటివి ఫైనల్ చేసేందుకు దీనిని వినియోగించాలి. ప్రతి బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా కటాఫ్ తేదీకి అనుగుణంగా ఇచ్చిన పంట రుణాలను నిర్దేశించిన నమూనాలో రైతుల జాబితా రూపొందించాలి. అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకుల శాఖల్లో పంట రుణాలుగా బంగారంపై పొందిన అప్పుకు మాఫీ వర్తించదు. అయితే కొన్నిచోట్ల గ్రామాల్లో సేవా ప్రాంతాలుగా ఉన్న అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకుల్లో పొందిన రుణాలకు మాఫీ వర్తిస్తుంది. రెండు నమూనాల్లో (అనక్సర్ ఎ, అనక్సర్ బి) పొందుపర్చిన రైతుల జాబితా సమాచారాన్ని బ్యాంకు మేనేజర్ సరిపోల్చుకోవాలి. తరువాత రూ. లక్ష మించకుండా ఉన్న పంట రుణాల తుది జాబితాను అనక్సర్ సి నమూనాలో రూపొందించాలి. ఈ మూడింటిని లీడ్ బ్యాంకు మేనేజర్‌కు, జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. కొందరు రైతులు ఒకే బ్యాంకు వేర్వేరు బ్రాంచ్‌లలో లేదా వేరే బ్యాంకులలో పంట రుణాలు తీసుకుంటే డూప్లికేషన్, డబుల్ పేమెంట్అరికట్టేందుకు మండల స్థాయిలో సంయుక్త మండల బ్యాంకర్ల కమిటీ(జేఎంఎల్‌బీసీ) ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ రైతులు అన్ని బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను పోలుస్తుంది. నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో ఎవరైనా రుణం తీసుకున్నారా, వ్యవసాయ భూములున్నవారేనా వంటిని చూస్తారు. అర్హత లేనివారుంటే తొలగిస్తారు. అనంతరం అనక్సర్ డిలో సమాచారం పొందుపరుస్తారు. జిల్లా సహకార శాఖ ఆడిటర్స్ ప్యాక్స్, డీసీసీబీలకు సంబంధించిన డి జాబితాతో పాటు ఎ, బి, సి జాబితాలను కూడా ధ్రువీకరించాలి. బ్యాంకులు అనక్సర్ సి, డిలను ఐటీ పోర్టల్‌లో స్క్రూటిని చేస్తారు. తాత్కాలిక తుది జాబితా సంబంధిత గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. ఆ తరువాత బ్రాంచ్‌ల వారీగా అర్హులైన రైతుల తుది జాబితాను లీడ్ బ్యాంక్ మేనేజర్ జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. రైతుల వారీగా అర్హులైన వారి జాబితాను జిల్లాల్లో బ్యాంకర్ల మీటింగ్‌లో సమీక్షించి, రికార్డు చేసి దానిని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపిస్తారు. అదే ఐటీ పోర్టల్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తిరిగి బ్యాంకుల వారీగా రైతుల వారీగా చెల్లించాల్సిన మొత్తం వివరాలను, ప్రభుత్వం మంజూరు చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది.
అర్హులను గుర్తిస్తారిలా..
రైతు కుటుంబాలను గుర్తించేందుకు ఏఈవో, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు. తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయాధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నా ఒక కుటుంబానికి రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తారు. రైతు కుటుంబం అంటే కుటుంబ పెద్ద, భార్య, వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పంటరుణానికి అర్హులైతే రూ. ఒక లక్ష మొత్తంలో ఉన్నవారందరికీ సమానంగా ఇస్తారు. స్వల్పకాలిక పంట రుణాలు 18 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్నవాటికే మాఫీ వర్తిస్తుంది. ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.