సుల్తానాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పీఏసీఎస్) ఆఫీసుకు ఓ రైతు తాళం వేశాడు. పీఏసీఎస్ సీఈవో రమేశ్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బందిని కొద్దిసేపు ఆఫీసులో నిర్బంధించాడు.
తాను రెబల్ దేవ్ పల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్ కు దాదాపు 25 రోజుల కింద వడ్లు తీసుకువచ్చానని, సగం మాత్రమే కొన్నారని, మిగతా వడ్లను కొనమంటే తేమ పేరుతో సతాయిస్తున్నారని రైతు రాజి రెడ్డి ఆరోపించాడు. 40 క్వింటాళ్ల బస్తాకు అదనంగా రెండు కిలోలు తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పీఏసీఎస్ ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపాడు. సమస్యను పరిష్కరిస్తామని చైర్మన్ మో హన్ రావు హామీ ఇవ్వడంతో నిరసన విరమించాడు. .