జేసీ కాళ్లపై పడ్డ రైతు మొగిళి
నర్సంపేట, వెలుగు: పట్టా పాస్ బుక్కు కోసం తిరిగి తిరిగి వేసారిపోయిన ఓ రైతు జేసీ కాళ్ల మీద పడి తన గోడు చెప్పుకున్న సంఘటన మంగళవారం వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆఫీసుల్లో పైసలిస్తేనే పనులు జరుగుతున్నాయని కొందరు రైతులు, నాయకులు ఇటీవల వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్కు దుగ్గొండి మండల రెవెన్యూ ఆఫీసర్లపై ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారించాలని జేసీని ఆదేశించారు. విచారణ నిమిత్తం జేసీ మహేందర్రెడ్డి దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు.
ఆ సమయంలో ‘పైసలియ్యందే పట్టా చేయమంటాండ్రు సార్, పైసలిచ్చి పట్టా చేయించుకునే స్తోమత లేదు. ఎట్లైన పట్టా బుక్కు చేయ్యాలె సార్’ అంటూ ముద్దునూరు గ్రామానికి చెందిన రైతు మొగిళి జేసీ కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఈ తతంగం చూసిన సాటి రైతులు తీవ్ర ఉద్విగ్నానికి లోనై గంటసేపు జేసీని తహసీల్ కార్యాలయం ముందు ఎటూ కదలకుండా ఆపారు. దుగ్గొండి మండలంలో పైసలియ్యనిదే ఏ పని జరగడం లేదని, చెరువు శిఖం అని చుట్టూ ఉన్నవారి నుంచి పైసలు తీస్కొని పట్టాలు చేసి, నడుమ ఉన్న పొలాన్ని చెరువు మునుగుడని ఆపారని ఆరోపించారు. దాంతో జేసీ స్పందిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం కాదు.. జిల్లా ఆఫీసర్ల వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకుంటే కొన్ని సమస్యలైనా తీరతాయని వారితో అన్నారు