ట్రిపుల్​ ఆర్​ స్ట్రక్చర్ వ్యాల్యూయేషన్​ను అడ్డుకున్న రైతు

ట్రిపుల్​ ఆర్​ స్ట్రక్చర్ వ్యాల్యూయేషన్​ను అడ్డుకున్న రైతు

చౌటుప్పల్, వెలుగు : ట్రిపుల్​ ఆర్ భూసేకరణలో భాగంగా చేపట్టిన స్ట్రక్చర్​​వ్యాల్యూయేషన్​ను రైతు అడ్డుకున్నారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తంగెడపల్లిలో సోమవారం జరిగింది. ట్రిపుల్ ఆర్​ కోసం చౌటుప్పల్ పరిధిలోని చౌటుప్పల్, వలిగొండ మండలాల్లో దాదాపు 780 ఎకరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే త్రీజీ నోటిఫికేషన్లు జారీ కావడంతో పాటు అక్టోబర్​లో ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ కూడా పెంచారు.

 అక్టోబర్​ 21 నుంచి నాలుగు రోజులు నిర్వహించిన అవార్డు మీటింగ్​కు రైతులు గైర్హాజరైన సంగతి తెలిసిందే. కాగా పొలాల వద్ద ఉన్న కట్టడాలు, చెట్లు వంటివి లెక్కించి వాటి స్ట్రక్చర్​ వ్యాల్యూయేషన్​ చేయడానికి  తంగెడపల్లిలో రైతు ఎల్లయ్య భూమి వద్దకు ఆర్​అండ్​బీ, రెవెన్యూ స్టాఫ్​ వచ్చారు. భద్రత కోసం తమ వెంట పోలీసులను కూడా తీసుకొచ్చారు. దీంతో ఓ రైతు వారిని అడ్డుకొని ఎందుకొచ్చారని నిలదీశారు. 

తాము వచ్చిన విషయాన్ని స్టాఫ్ వివరించడంతో, ఇచ్చిన హామీ ప్రకారం హయ్యర్​ ఆఫీసర్లతో మాట్లాడించిన తర్వాతే లెక్కించాలని లేని పక్షంలో అవసరం లేదని తేల్చి చెప్పారు. స్టాఫ్​ నచ్చజెప్పినా సదరు రైతు వినలేదు. దీంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి వివరణ కోరగా డివిజన్ పరిధిలో భూముల స్ట్రక్చర్ వాల్యుయేషన్ ఇప్పటికే  పూర్తి చేశామని చెప్పారు. పెండింగ్​లో ఉన్న ముగ్గురు రైతుల పొలాల్లోని కట్టడాలకు సంబంధించి స్టక్చర్ వ్యాల్యూయేషన్​ చేయడానికి ఆఫీసర్లు వెళ్లారని తెలిపారు.