
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కిష్టయ్యబంజరకు చెందిన రైతు జంగం రఫెల్ ఒక ఎకరం సొంతం, మరో ఎకరం కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. వరి ధాన్యాన్ని కల్లూరు సమీపాన ఉన్న శివాలయం ఆవరణలో ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించి పట్టాలపై ఆరబెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన ధాన్యం సుమారు 20 క్వింటాళ్ల వరకు వరద పాలై సమీపంలోని క్వారీ గుంతలోకి చేరి నీట మునిగింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వరి పంట సాగు చేశానని, అకాల వర్షానికి సగం పంట నీటిపాలైందని రఫెల్ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. – ఖమ్మం, వెలుగు