రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుండెపోటుతో రైతు మృత్యువాత

కోనరావుపేట, వెలుగు: గాలివానకు వరి పంట దెబ్బతినడంతో మనోవేదనకు గురై ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పంబాల స్వామి(53) అనే రైతు తన రెండెకరాల్లో వరి పంట సాగు చేశాడు. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు చేతికందిన పంట నేలపాలై తీవ్ర నష్టం జరిగింది. దీంతో మనోవేదనకు గురైన స్వామి ఆదివారం రాత్రి ఇంటి ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు చూసే సరికి మృతిచెందాడు. స్వామికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. స్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.