
కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లి మండలంలోని సదాశివ పల్లి జీపీ పరిధి పాంపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణ గౌడ్ చెరుకు పంట తరలించడానికి దారి లేదని ఆదివారం రెండెకరాల చెరుకు పంటకు నిప్పంటించాడు. సదాశివ పల్లి మాజీ సర్పంచ్ వీరయ్య రెండు రోజుల క్రితం రాత్రి కనికల చెరువు కట్టను తవ్వి దారి లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. చెరుకు తరలించడానికి దారి ఇవ్వకుండా రెండేళ్ల నుంచి మాజీ సర్పంచ్ వీరయ్య వేధిస్తున్నాడని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.
ఆ బాధ భరించలేక చెరుకు తోటకు నిప్పు అంటించినట్టు తెలిపాడు. రెండు ఎకరాలు తగిలిపోవడం వల్ల సుమారు రూ. 2 లక్షల 50 వేల నష్టం జరిగినట్లు చెప్పాడు. మాజీ సర్పంచ్ వీరయ్య ను అరెస్ట్ చేయాలి లేని పక్షంలో మా కుటుంబం మొత్తం చనిపోవడానికి సిద్ధం గా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. తన చెరుకు పంట తరలించడానికి దారి చూపి అధికారులు న్యాయం చేయాలని కోరాడు.