ధరణి లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసమస్యలకు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చిపడటంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు, సిబ్బంది చేసిన తప్పులకు రైతన్నలు తిప్పలు పడుతున్నారు. తాజాగా కరీంగనర్ జిల్లాలో తన భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ ఓ రైతు నిరసనకు దిగాడు. కలెక్టరేట్ లోని ప్రజావాణిలో ఓ రైతు వినూత్న ధర్నా చేశారు. తన భూమికి సంబంధించిన పట్టాదారుల పాసుపుస్తకం కోసం.. పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు.
గంగాధర మండలం గట్టుభూత్కూరుకు చెందిన నాంపల్లి అనే రైతు తన భూమికి సంబంధించిన అప్లికేషన్ పేపర్లన్ని దండలాగా మెడలో వేసుకొని నిరసన వ్యక్తం చేశాడు. తనకున్న 31 గుంటల భూమి ఇతరుల పేరిట చేశారంటూ.. పురుగుల మందుతో నాంపల్లి ఆందోళన చేశాడు. తన భూమి తనకు ఇప్పించాలంటూ ఆర్డీవో కాళ్ళు మొక్కి విజ్ఞప్తి చేశాడు. గతంలో పనిచేసిన అధికారులు లంచం ఇస్తేనే.. పాస్ పుస్తకం ఇస్తామని బెదిరించారని నాంపల్లి వాపోయాడు. దీంతో అక్కడ ఉన్న ఆర్డీవో ఆనంద్ కుమార్ నాంపల్లి అప్లికేషన్ పేపర్లు చూసి.. తన సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.