పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన

మల్లాపూర్, వెలుగు : తన భూమి ధరణిలో మరొకరి పేరున పట్టా కావడం, దానిని తిరిగి మార్చేందుకు అతడు అంగీకరించకపోవడంతో ఓ రైతు పురుగుల మందు డబ్బాతో పట్టాదారుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో సోమవారం జరిగింది. మల్లాపూర్‌కు చెందిన పల్లె రాజాం అదే గ్రామానికి 1,081 సర్వే నంబర్‌లో 2.10 ఎకరాల భూమిని 1988లో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాడు.

అయితే ఇతడికి చెందిన 1.27 గుంటల భూమి మేడిపల్లి రాజారెడ్డి పేరున, మరో 23 గుంటల భూమి పిప్పోజి మహేందర్‌ పేరున ధరణిలో నమోదైంది. దీంతో ఆ భూమిని తన పేరున మార్చాలని రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. అయితే పట్టాదారుడు వచ్చి సంతకం చేస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని ఆఫీసర్లు చెప్పారు. దీంతో సంతకం చేసేందుకు పట్టాదారుడు రాజారెడ్డి ఒప్పుకోవడం లేదు. దీంతో రాజాం కుటుంబ సభ్యులు సోమవారం రాజారెడ్డి ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో బైఠాయించి నిరసన తెలిపారు.