రైతు హక్కులకూ రక్షణ ఉండాలె

దేశంలో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఢిల్లీని దిగ్బంధనం చేసిన రైతులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపినా సానుకూల  ఫలితం రాలేదు. మూడు నెలలైనా ఆందోళన కొనసాగిస్తామని రైతులు చెబుతుంటే.. ఇప్పుడున్న చట్టాలకు కొన్ని సవరణలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన ఉద్యమాల్లో ఇంత దీర్ఘకాలం పాటు లక్షలాది మంది పాల్గొన్న నిరసన కార్యక్రమం ఇదే.

ఢిల్లీకి వచ్చే ఐదు ప్రధాన రహదారులను రైతులు ముట్టడించారు. నవంబర్ 26 నుంచి ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రైతులను ప్రత్యక్షంగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలు అనుసరించడంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. 90 వేల ట్రాక్టర్లలో వచ్చిన లక్షలాది మంది ఎముకలు కొరికే చలిలో రోడ్లపై ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఢిల్లీ వీడేది లేదంటున్నారు. ఈ నెలలో పలు మార్లు కేంద్ర వ్యవసాయ మంత్రి రైతులను చర్చలకు పిలిచారు. ఈ సమావేశానికి 40 సంఘాల ప్రతినిధులు హాజరై చర్చలు జరిపినా సఫలం కాలేదు. మద్దతు ధరకు భరోసాతో పాటు చట్టాల్లో కొన్ని సవరణలకు కేంద్రం ఓకే చెప్పింది. అయితే 3 చట్టాలను ఉపసంహరించే వరకు ఢిల్లీ విడిచి వెళ్లేదిలేదని రైతులు చెబుతున్నారు.

మూడు చట్టాల్లో ఏముంది?

కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు ఏమిటి.. వాటిలో ఏమున్నాయనేది ఒకసారి చూస్తే.. అవి 1. మార్కెట్ల రద్దు చట్టం, 2. రైతు కార్పొరేట్ సంస్థతో ధరల ఒప్పంద చట్టం, 3.నిత్యావసర సరుకుల సవరణ చట్టం. వీటి ద్వారా రైతులకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రక్షణలను తొలగించారు. కనీస మద్దతు ధర మాటే ఈ చట్టాల్లో చేర్చలేదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం స్వేచ్ఛను కార్పొరేట్లకు ఇవ్వడంతో ఇప్పటికే కొనుగోలుదారుల వల్ల నష్టపోతున్న రైతులకు ఈ చట్టాలతో మరింత నష్టం జరిగి, భూములు కార్పొరేట్ సంస్థలకు అప్పగించాల్సిన దుస్థితి వస్తుంది. మొత్తం మార్కెట్ వ్యవస్థ రద్దవుతుంది. పంట కొనుగోలులో కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యం అవుతుంది. నిత్యావసర సరుకుల చట్టం సవరణతో బ్లాక్ మార్కెట్‌‌కు తలుపులు బార్లా తెరిచారు. వినియోగదారుడు, రైతు ఇద్దరికీ నష్టం చేసి కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల లాభాలను కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేసింది.

ఎన్నాళ్ల నుంచో రైతుల పోరుబాట

కిసాన్ ముక్తి యాత్ర పేరుతో రైతులపై కాల్పులు జరిపి ఆరుగురు రైతుల చావుకు కారణమైన మందసోర్ ప్రాంతం నుంచి 2017 జూలై 18న జరిగిన యాత్రలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. 2017 సెప్టెంబర్ 16 నుంచి నాలుగు జాతాలు దేశవ్యాప్తంగా కిసాన్ సభ నాయకత్వాన జరిగాయి. తమిళనాడులోని విరుద్దు నగర్, కన్యాకుమారి నుంచి, కశ్మీర్​లోని జమ్మూ నుంచి, కోల్‌‌కత్తా నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ నవంబర్ 24న ఢిల్లీ చేరుకొని 2 లక్షల మందితో ర్యాలీ చేశారు. అంతకు ముందు రైతు సంఘాలతో ట్రేడ్ యూనియన్లు కలిసి రైతాంగ సమస్యల పరిష్కారానికి ఢిల్లీ లో ర్యాలీ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 8న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ జరిగింది. నవంబర్ 21న అటవీ హక్కుల చట్టం అమలుకై గిరిజన రైతులతో చలో ఢిల్లీ కార్యక్రమం జరిగింది. అంతకు ముందు నవంబర్ 5న దేశవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించారు. ఇన్ని సందర్భాల్లో రైతాంగం కదలిక గమనించినప్పుడు తమ వ్యవసాయ పనులు ఉన్నప్పటికి పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశ ప్రజల్లో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని తపన పెరిగి చాలా సంఘాల వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల సంఖ్యలో పాల్గొంటున్నారు. మరికొందరు రైతు ఉద్యమాల జయప్రదానికి నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నారు.

50 శాతం జనాభాకు వ్యవసాయమే ఆధారం

దేశంలో 14.57 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉండగా.. వారిపై 52 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. మొత్తం రైతుల్లో 12.47 కోట్ల మంది 5 ఎకరాలకు లోపు ఉన్న వారే. వీరికి తోడు వ్యవసాయ కార్మికులుగా మరో 20 కోట్లు మంది ఆధారపడి ఉన్నారు. అంటే దేశ జనాభాలో 50 శాతం మంది అనగా 72 కోట్ల మంది వ్యవసాయ రంగం ఉపాధిపై ఆధారపడ్డారు. వాస్తవం ఏమిటంటే వీరిలో 50 శాతం మందికి కనీస అక్షరాస్యత కూడా లేదు. కనీస నైపుణ్యం లేకపోవడంతో విధిగా వ్యవసాయన్ని వదలలేకుండా ఉన్నారు. వీరికి తోడు ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభించడం వలన గతంలో గ్రామీణ ప్రాంతం నుంచి వలసపోయిన 19 కోట్ల మంది ప్రజలు తిరిగి గ్రామాలకు తిరిగి వచ్చారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు, ఫ్యాక్టరీ పనులు, రహదారుల నిర్మాణం తదితర పనులన్నీ కరోనా వలన నిలిచిపోవడంతో ఉపాధి లేకుండా పోయింది. ఇలాంటి స్థితిలో వ్యవసాయ రంగంపై పెరిగిన ఒత్తిడి, ఇంతకు ముందే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగం అతలాకుతలం అవుతున్నది. వ్యవసాయం గిట్టుబాటు లేనిదిగా మారింది. ఈ స్థితిలో కేంద్రం తెచ్చిన చట్టాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ప్రమాదకరంగా మారాయి.

ప్రభుత్వ రక్షణ చర్యలు లేవు

వ్యవసాయ రంగం అభివృద్ధితోపాటు రైతుల ఆదాయం పెరగడానికి ప్రభుత్వ రక్షణ చర్యల అవసరం ఉంది. కానీ మనదేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, వాస్తవ సాగుదారుల పేర్లు రికార్డుల్లో నమోదు, స్థానిక ఉత్పత్తులకు నష్టం జరగకుండా ఉండేలా ఎగుమతి, దిగుమతుల పాలసీ, పంటల ధరల నిర్ణయం అమలు సరిగ్గా జరగట్లేదు. అమెరికాలో 8 రకాల రాయితీలను అక్కడి ప్రభుత్వం కల్పించింది.  రైతుల ఉత్పత్తి ధరలను లాభదాయకంగా నిర్ణయించడంతో అక్కడ ఆత్మహత్యలు ఉండటం లేదు. జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలలో చిన్న కమతాల వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం అదే కార్పొరేట్ విధానాలను మన దేశం అమలు చేయపూనుకుంది. అందులో భాగంగానే కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టే ప్రయత్నం చేసింది.

ఉపయోగపడని ప్రభుత్వ పథకాలు

రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం కొరకే ఈ మూడు చట్టాలు తీసుకువచ్చారు. ఇప్పటికే ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనేక రాష్ట్రాలు కౌలుదారులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యాయి. భూమిపై రైతుల హక్కులను రక్షించే చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చుతున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ప్రభుత్వ అవసరాలకు, ప్రాజెక్టులకు భూ సేకరణను చేస్తున్న సందర్భంలో పేదల భూములనే లక్ష్యంగా పెట్టుకొని సేకరిస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు జరపకుండ కేంద్రం, రాష్ట్రాలు చట్టాలకు సవరణలు చేసి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారు. జాతీయ రహదారులు, రైల్యే లైనులకు అటు ఇటూ కిలోమీటర్ దూరం భూమిని సేకరించడానికి చట్టం రుపొందించారు. 13 రాష్ట్రాల్లో 3.45 లక్షల కోట్ల వరకూ రుణమాఫీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వాలు రెండేండ్లు గడిచినా వాటిని అమలు చేయడంలేదు. నేడు బ్యాంకులు రైతులకు రుణాలివ్వడం తగ్గించాయి. దీంతో ప్రైవేట్ రుణాలపై ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోయి ఎక్కువ మంది అప్పులపాలవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన వ్యవసాయ రంగ పథకాలు సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగంగా లేవు.

మూడ్ శోభన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం

For More News..

ప్రేమపెళ్లి చేసుకున్న బిడ్డల్ని చంపితే పరువు నిలుస్తుందా?

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో టాప్‌‌‌‌లో కోహ్లీ

బైడెన్ సర్కారులో కీలక పదవిలో ఇండో-అమెరికన్