తన భూమిని ల్యాండ్ మాఫియా కాజేశారని, దానిని వారి నుంచి తనకు ఇప్పించాలని ఓ వృద్ధ రైతు ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినప్పటికీ వారిలో చలనం లేకపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపారు. చేతులు జోడించి కలెక్టరేట్ ఆఫీస్ నేలపై దొర్లుతూ పొర్లు దండాలు పెట్టారు. ఆ సమయంలోనూ అధికారులు చుట్టూ చేరి ఆయనను తదేకంగా చూస్తున్నారే తప్ప.. ఆపే ప్రయత్నమూ చేయకపోవడం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది.
వీడియోలో పొర్లు దండాలు పెడుతున్న రైతు పేరు.. శంకర్‌లాల్. ఆయనకు వారసత్వంగా వచ్చిన భూమిని ల్యాండ్ మాఫియా ఆక్రమించుకున్నారట. వారి నుంచి దానిని తిరిగి తనకు ఇప్పించాలని ఎన్నో ఏళ్లుగా ఆయన ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ, అధికారుల్లో చలనం రాకపోవడంతో నేలపై దొర్లుతూ పొర్లు దండాలతో 'న్యాయం చేయండి ప్రభో..' అని వేడుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
मंदसौर के बुजुर्ग किसान हैं, कहते हैं कहीं सुनवाई नहीं हो रही आरोप है कि ज़मीन फर्जी दस्तावेजों के जरिये कुछ लोगों ने हड़प ली है ... कलेक्टर दफ्तर से यूं निराश होकर लौटे ... pic.twitter.com/bpAHfHp2NH
— Anurag Dwary (@Anurag_Dwary) July 17, 2024
అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు శంకర్‌లాల్ ఆరోపించారు. "తహసీల్దార్ తప్పు చేస్తే.. రైతు బాధపడతాడు. వారు చేసిన తప్పుకు నేను పర్యవసానాలు అనుభవిస్తున్నాను. ప్రభుత్వం, పరిపాలనపై అసంతృప్తిగా ఉన్నాను. భూమాఫియాతో ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు.. రైతులు మోసపోతున్నారు.." అని శంకర్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read :- దెయ్యాలను తరిమే గుడి ఎక్కడుందో.. తెలుసా..
రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న బాబు దేశ్‌ముఖ్ అనే అధికారి తన భూమిని ఆయన కొడుకు అశ్విని దేశ్‌ముఖ్ పేరిట 2010లో మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి పాటిదార్ తన భూమిని తిరిగి ఇప్పించాలని పోరాడుతున్నాడు.
కాగా, ఈ ఘటనలో ఫిర్యాదుదారుడు(శంకర్ లాల్) పేర్కొన్న వివాదాస్పద భూమి తన ఆధీనంలోనే ఉంచుకున్నాడని స్థానిక యంత్రాంగం స్పష్టం చేసింది.