ఎడ్లబండిపై వెళ్తుంటే ఎదురైన పులి.. భూపాలపల్లి జిల్లాలో భయంభయం

ఎడ్లబండిపై వెళ్తుంటే ఎదురైన పులి.. భూపాలపల్లి జిల్లాలో భయంభయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మహదేవపూర్  మండలంలో పెద్దపులి తిరుగుతుందన్న వార్తతో జనం భయం గుప్పిట్లో గడుపుతున్నారు. మండలంలోని పల్గుల అడవిలో సంచరిస్తుందని రైతులు చెప్పడంతో స్థానికులు భయాందోనకు గురవుతున్నారు. 
 
అయితే ఎండ్లబండిలో అడవి మార్గం ద్వారా చేనుకు వెళ్తుండగా పులి కంటబడిందని ఓ రైతు ఓ రైతు చెప్పడంతో వార్త మండలం అంతా వ్యాపించింది. దీంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. చుట్టుపక్కల పరిశీలించినఅధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి ఎటువైపు వెళ్లి ఉంటుందనే కోణంలో అడవిని‌ జల్లెడ పడుతున్నారు. కాటారం, మహదేవపూర్ మండలాల్లోని అడవుల్లో గత పది రోజులుగా సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు.

కుంటలు, వాగుల వద్ద పులి పాదముద్రలు గుర్తించారు. గోదావరి దాటి మంచిర్యాల జిల్లాకు వెళ్ళే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిన్న (సోమవారం, ఫిబ్రవరి 17) పూస్కుపల్లి ఇసుక క్వారీ వద్ద పులి అడుగులను స్థానికులు గుర్తించారు. గతేడాది ఇదే ప్రాంతంలో సంచరించి మంచిర్యాల జిల్లాకు వెళ్లిపోయిందని చెబుతున్నారు. గ్రామస్తులు అడవి ప్రాంతాలకు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.