
రైతుల అవస్థలు ఎంత చెప్పినా తక్కువే. ఆరుగాలం కష్టపడి పంట వేస్తే వాతావరణం కరుణించకపోయినా కష్టమే. పంట చేతికి వచ్చినా.. గిట్టుబాటు ధర లేకపోయినా కష్టమే. ఎటుతిరిగీ రైతుకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. తాజాగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నిరాశకు చెందిన రైతన్న చెరుకు పంటకు నిప్పు అంటించడం చర్చనీయాంశం అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా మాడుగుల దేవరాపల్లి కొత్తపెంట గ్రామంలో రైతు చెరుకు పంటకు నిప్పు అంటించాడు. రాత్రిబవళ్లు కష్టపడి పంట వేస్తే.. తీరా అమ్మకునే సమయానికి ధరలు పడిపోవడంతో విసిగిపోయిన రైతు నిరాశకు గురై పంటకు నిప్పంటించాడురొంగలి వెంకటరావు అనే రైతు. ఈ ఘటనలో 20 టన్నుల చెరుకు తోట అగ్నికి ఆహుతయ్యింది.
ALSO READ | శ్రీశైలం వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంటి : సీసీ కెమెరాలో రికార్డు
ప్రతి సంవత్సరం 60 టన్నుల చెరుకు చోడవరం చక్కె ర కర్మాగారానికి సరఫరా చేసే వాడినని.. సకాలంలో పేమెంట్లు అయితే అంతా బాగుండేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్యాక్టరీ యార్డులోనే తీసుకెళ్లిన చెరుకు ఎండిపోతుందని చెప్పాడు. కూలీలకు, రైతులకుపేమెంట్లు సకాలంలో చెల్లించడం లేదని, ఫ్యాక్టరీ మాత్రం ఎప్పుడో డబ్బులు అకౌంట్ లో వేస్తోందని ఆ గ్రామ రైతులు తెలిపారు. దీని వలన రైతుల అప్పుపై వడ్డీ పెరిగి ఇబ్బందులు పడుతున్నామన్నారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో పంటను తీసుకెళ్లినా గిట్టుబాటు ధర రాదని తెలిసి ఆవేదనతో చెరుకు తోటకు నిప్పు పెట్టినట్లుగా రైతు తెలిపాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చెరుకును కూలీలను పెట్టి పనిచేయించి సరఫరా చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదని.. అందుకే ఏం చేయాలో తెలియక పండించిన పంటకు నిప్పు పెట్టవలసి వచ్చిందని ఆవేదన చెందారు. సుమారు 20 టన్నులు చెరుకు, 60వేల రూపాయల నష్టం వాటిల్లిందని వాపోయారు.