నవాపేట్‌‌ గ్రామాంలో ధర తగ్గిందని టమాటకు నిప్పు

నవాపేట్‌‌ గ్రామాంలో ధర తగ్గిందని టమాటకు నిప్పు

శివ్వంపేట, వెలుగు : టమాట రేటు భారీ స్థాయిలో పడిపోవడంతో రైతులు పంటను అమ్మలేక అలాగే వదిలేస్తున్నారు. కిలో టమాట అమ్మితే రూపాయి కూడా రావడం లేదన్న బాధతో ఓ రైతు తన పంటకు నిప్పు పెట్టాడు. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట్‌‌ గ్రామానికి చెందిన హరి గౌడ్‌‌ పదిహేనేండ్లుగా నాలుగైదు ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో పంట వేశాడు. పంట చేతికి వచ్చే టైంలో ధర పూర్తిగా పడిపోవడం, పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో టమాటలు తెంపకుండా అలాగే వదిలేశాడు. గురువారం తోటకు నిప్పు పెట్టి పూర్తిగా కాల్చివేశాడు. 

ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ టమాట తెంపితే రోజుకు 200 బాక్సులు వస్తాయని, మార్కెట్‌‌లో ఒక్కో బాక్స్‌‌ రూ.50 మాత్రమే పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 30  ఆటో కిరాయి పోను బాక్స్‌‌కు రూ. 20 మాత్రమే మిగులుతుందని వాపోయాడు. టమాట తెంపి మార్కెట్‌‌కు తరలిస్తే కూలీల డబ్బులు మీద పడుతున్నాయని, మరో గత్యంతరం లేక పంటను తగులబెట్టినట్లు తెలిపాడు. నవాపేట గ్రామంలో  25 మంది రైతులు సుమారు 70 ఎకరాల్లో పంట సాగు చేయగా, పది మంది రైతులు టమాటాలు తెంపకుండా అలాగే వదిలేశారు.