ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా 600 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి. రైతుబంధు, రైతుబీమా మినహా మిగిలిన వ్యవసాయ పథకాలన్నీ కొద్ది హెచ్చుతగ్గులతో గత ప్రభుత్వాల కాలంలో అమలు చేసినవే. రాష్ట్రంలో కౌలు రైతుల హక్కులు శతాబ్దాల నుంచి కొనసాగుతుండగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక వాటిని హరించివేసింది. వారికి ఎలాంటి రికార్డు లేకుండా చేయడంతో ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. ఈ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో కౌలు రైతులు, ఐదెకరాలలోపు గల పేద రైతులే ఉంటున్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2019లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 373 మంది రైతులు, 118 మంది కౌలుదారులు, 8 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయంలో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. ఈ ఆత్మహత్యలకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు.
నాలుగు సంవత్సరాలుగా రైతులకు పంట రుణాలు అందడం లేదు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన రూ.16,163 కోట్లను నాలుగు సంవత్సరాల పాటు విడతలుగా చెల్లించడంతో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. 2018లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.24 వేల కోట్లు రుణమాఫీ ప్రకటించడంతో అదే విధానం కొనసాగింది. రూ.25 వేల లోపు రుణాలున్న వారిని 5.85 లక్షల మంది మాత్రమే ఒకేసారి రుణమాఫీ పొందారు. మిగిలిన రైతులు మూడు సంవత్సరాల తర్వాతే రుణ విముక్తులవుతారు. అందువల్ల రాష్ట్రంలో రైతులు రూ.20 వేల కోట్లకుపైగా అధిక వడ్డీలకు ప్రైవేట్ రుణాలు తీసుకుని వ్యవసాయం కొనసాగిస్తున్నారు. బ్యాంకు రుణాలు అందకపోవడం వలన పంటల బీమా పథకం వారికి వర్తించడం లేదు. రుణాలు తీసుకోని వారి నుంచి ప్రీమియం వసూలు చేసే వ్యవస్థ లేదు. దీనికి తోడు రైతును నష్టపర్చడానికి ప్రకృతి వైపరీత్యాలు వెన్నంటే ఉంటున్నాయి. 2020 వానాకాలంలో భారీ వర్షాల కారణంగా 2 లక్షల ఎకరాలలో వరి, పత్తి, జొన్న, సోయ, పప్పులు మొదలైన పంటలు దెబ్బతిన్నాయి. 2019-–20 యాసంగిలో వడగండ్ల వాన వలన రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు 2014 నుంచి 2020 వరకు వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు రూ.29 వేల కోట్ల పంటలను నష్టపోయారు. 14వ ఫైనాన్స్ కమిషన్, 15వ ఫైనాన్స్ కమిషన్‌లో కేంద్రం రూ.1,900 కోట్లు కేటాయించింది. ఈ నిధులు కూడా సక్రమంగా రైతులకు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదిక పంపడానికి ఇగో అడ్డం వస్తున్నది. మిగిలిన అన్ని రాష్ట్రాలు వెంటవెంటనే నివేదికలు పంపి అదనపు పరిహారం తెప్పించుకుంటున్నాయి.
నకిలీలు, కల్తీల బెడద
నాణ్యతలేని విత్తనాల వలన ఏటా 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. 2020 వానాకాలంలో 25 వేల క్వింటాళ్ల నిషేధించబడ్డ, కల్తీ, నాణ్యత లేని విత్తనాలను విజిలెన్స్ విభాగం పట్టుకుంది. 220 కేసులు పెట్టినప్పటికీ అసలు ముద్దాయిలను తప్పించారు. రవాణా చేస్తున్న వారిని నిల్వ పెట్టుకున్న వారిని అరెస్టు చేశారు. బడా కంపెనీలే మహబూబ్‌నగర్ జిల్లా భూత్పుర్, వికారాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లో శాశ్వత కల్తీ విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసి కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు. ఇది అధికారులకు తెలియనిది కాదు. మరోవైపు రాష్ట్రంలో ఎరువుల కొరత, కల్తీ ఎరువులు, నకిలీ క్రిమిసంహారక మందుల బెడద కొనసాగుతోంది. వందల కోట్లలో ఈ వ్యాపారం సాగుతున్నది. బయోపెస్టిసైడ్స్ పేర జరుగుతున్న ప్రచారానికే కోట్ల కొద్దీ వ్యయం చేస్తున్నారు. వర్షాలు పడగానే యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశిస్తే.. వ్యవసాయ మంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి యూరియా కోసం అర్థిస్తున్నారు. కానీ యూరియా కొరత మాత్రం ఎప్పుడూ అలానే కొనసాగుతోంది.
దిగుమతుల కారణంగా నష్టాలు
అన్నిటికన్నా ముఖ్యంగా దిగుమతుల వలన రాష్ట్ర రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. వంటనూనెలు, పత్తి, పంచదార, కూరగాయాలు, పండ్లు, పూలు, పాలు దిగుమతుల కారణంగా ఇక్కడ పండే ఉత్పత్తులకు ధరలు తగ్గి రైతులకు గిట్టుబాటు కావడం లేదు. మన దగ్గర సమృద్ధిగా ఉత్పత్తి అయ్యే పంటల దిగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ పెట్టగల స్థితిలో లేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా అమలు కావడం లేదు. అందుకు తగిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణాయక సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర రైతులకు గిట్టుబాటు అయ్యే ధరలు నిర్ణయించాలి. లేదా బోనస్ ఇవ్వాలి. పంటలు వేసే ముందే ధరలు నిర్ణయించి వాటిని అమలు చేయాలి. కానీ వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, మార్కెటింగ్ శాఖ మధ్య సమన్వయం లేకపోవడంతో కనీస గిట్టుబాటు ధరలు కూడా అమలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలు అమలు కానందున రాష్ట్ర రైతులు రూ.3,000 కోట్లకు పైగా నష్టపోతున్నారు. శాస్త్రీయంగా గిట్టుబాటు ధరలు ప్రకటించకపోవడంతో మరో రూ.6 వేల కోట్ల వరకూ మధ్య దళారీల పాలవుతోంది. రైతుల ఉత్పత్తులను ప్రోసెసింగ్ చేసి అదనపు విలువ తెస్తామన్న ప్రభుత్వం ఏడ్లు గడిచినా మధ్య దళారీలకు అనుకూలమైన విధానాలనే అమలు చేస్తోంది తప్ప రైతులను నష్టాల నుంచి బయటపడేయ లేకపోతోంది.
విధానాలు మారితేనే మార్పు
ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగానికి రైతుబంధు, రైతు బీమా పరిష్కారం చూపుతాయా? రైతు బీమా చనిపోయిన తర్వాత వచ్చేదే? రైతుబంధు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో రైతు ఆదాయాన్ని పెద్ద ఎత్తున మధ్య దళారీలు కాజేస్తున్నారు. దీనిని నివారించడానికి పేద రైతులతో వ్యవసాయ సహకార క్షేత్రాలను ఎర్పాటు చేసి యాంత్రిక వ్యవసాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడిని తగ్గించవచ్చు. కానీ పేదలను భూముల నుంచి గెంటివేసేలా బడా సంస్థలకు వ్యవసాయాన్ని అప్పగించడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎలాంటి రక్షణ లేని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వాల విధానాల అమలు మారకుండా ఆత్మహత్యల నివారణ జరగదు. కాకులకు ఎంగిలి మెతుకులు వేసినట్లు కొన్ని పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే రైతుల సంక్షేమం సాధ్యంకాదు. మధ్య దళారీలను తొలగించి ప్రభుత్వం ప్రత్యక్షంగా నేతృత్వం వహించడం ద్వారానే కొంతమేరకు మేలు జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు మారడం కాదు. ప్రభుత్వ విధానాలు మారాలి. ప్రజలందరికీ ఉపయోగపడే సంస్కరణలను అమలు చేయాలి. ప్రకృతి అనుకూలంగా ఉండడంతో అంతా తమ గొప్పతనమే అని జబ్బలు చరుచుకోవడం సరికాదు. రాష్ట్ర అవసరాల మేరకు పంటలను ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. మేలోనే వ్యవసాయ ప్రణాళిక, రుణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలి. సమస్యల పరిష్కారానికి అనువైన పథకాలు రూపొందించుకోవాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.
12 లక్షల మందికి పాస్‌బుక్కులు లేవు
భూమి హక్కుల కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా రైతుల్లో 12 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవు. 11 లక్షల మంది సాదాబైనామాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నారు. పండిన పంటలో అధిక భాగం పేద రైతులే లంచాలుగా చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, విత్తన సబ్సిడీ, మైక్రోఇరిగేషన్, ట్రాక్టర్లు, ఫామ్‌హౌస్, దీర్ఘకాలిక పథకాలపై రాయితీలు పేద రైతులకు అందుబాటులో లేవు. వీటిపై విచారణ చేస్తే పేద రైతుల పేరుతో పెద్దలు కాజేసిన జాబితా బయటికి వస్తుంది. మరోవైపు వ్యవసాయ శాఖ ద్వారా 3,500 ఎకరాలకు ఒక అధికారిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. వ్యవసాయ శాఖలో ప్రస్తుతం 4,200 ఖాళీలున్నాయి. వీటికి అదనంగా మరో 2,500 మందిని నియమించాలి. కానీ అందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు.
- మూడ్ శోభన్,రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం