రైతు ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండలంలో ఘటన

రైతు ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండలంలో ఘటన

పెన్‌‌పహాడ్‌‌, వెలుగు: పంట ఎండిపోయిందన్న బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండల పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై గోపీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మేగ్యా తండాకు చెందిన ఆంగోతు నాగేశ్వర్‌‌రావు (38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇందులో భాగంగా తనకు ఉన్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు.

అయితే నీరు సరిగా లేకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని మనస్తాపానికి గురైన నాగేశ్వర్‌‌రావు ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. అనంతరం విషయాన్ని తన తల్లికి చెప్పడంతో వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడికి భార్య లలిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.