వికారాబాద్: భూ వివాదంలో తనపై దాడి చేసిన వారికే ఎస్ఐ సపోర్ట్ చేస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ తీవ్రంగా గాయపడిన ఓ రైతు అంబులెన్స్ లో ఎస్పీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జిల్లాలోని పూడూరు మండలం రాకంచర్లలో కొన్ని రోజులుగా రైతు యాదయ్య, గోపాల్ ల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. ఈక్రమంలో ఫిబ్రవరి 6వ తేదీన యాదయ్యపై గోపాల్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యాదయ్య తీవ్రంగా గాపడ్డారు. దీంతో చన్ గోముల్ పోలిస్ స్టేషన్ లో యాదయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
తమ ఫిర్యాదును పట్టించుకోకుండా... దాడి చేసిన వారికే ఎస్ఐ వత్తాసు పలుకుతూ...చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితుడు ఆరోపించారు. లేచి కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్న యాదయ్యను అతని భార్య అరుణ.. అంబులెన్స్ లో ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లింది. ప్రాణం పోయేలా కొట్టిన వారికి వత్తాసు పలుకుతూ.. ఎస్ఐ తమను పట్టించుకోవడంలేదని ఎస్పీ కోటి రెడ్డికి బాధితులు ఫిర్యాదు చేశారు. యాదయ్యపై దాడిచేసి తీవ్రంగా కొట్టిన వారితోపాటు ఎస్ఐపై కూడా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఈ ఘటనలో నిందితులపై చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ భరోసా ఇచ్చారు.