- మానుకోట జిల్లా నర్సింహుల పేటలో ఘటన
- సర్ది చెప్పి దింపిన అధికారులు
నర్సింహులపేట, వెలుగు : భూ సమస్య పరిష్కరించాలని కొన్ని నెలల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఓ రైతు తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో పురుగుల మందు డబ్బాతో చెట్టెక్కాడు. మహబూబాబాద్జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారులోని ఆజ్య తండాకు చెందిన భూక్య బాలుకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ధరణి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త పాస్‌బుక్ ఇవ్వలేదు. దీని గురించి గతంలో ఆఫీసర్లను కలిసినా ఫలితం లేకుండా పోయింది.
కూతురి పెండ్లి ఉండడంతో తనకున్న 2 ఎకరాల్లో 28 గుంటలు అమ్ముకున్నాడు. కొన్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేద్దామంటే అతడి దగ్గరున్న పాస్‌బుక్‌తో కావడం లేదు. దీంతో ఆఫీసులో సర్వే కోసం దరఖాస్తు చేసుకోగా సర్వేయర్ ఫీల్డ్ మీదకు వెళ్లగా పక్కనున్న రైతులు సహకరించలేదు. దీంతో అసహనంతో బాధితుడు గురువారం తహసీల్దార్ ఆఫీసుకు పురుగుల మందు డబ్బాతో వచ్చి ఆవరణలోని చెట్టెక్కి నిరసన తెలిపాడు. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో చెట్టు దిగాడు.