పెట్రోల్ పోసుకున్న రైతు
నీళ్లు పోసి కాపాడిన తోటి రైతులు
పెద్దపల్లి జిల్లా కదంబాపూర్లో ఘటన
పెద్దపల్లి, వెలుగు: వరి కొనుగోలు ఆలస్యం కావడంతో ఓ రైతు పెట్రోల్పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ లో ఈ ఘటన జరిగింది. కదంబాపూర్ గ్రామానికి చెందిన మానుపాటి సమ్మయ్య పది రోజుల క్రితం స్థానిక మార్కెట్ సెంటర్లో ధాన్యం పోశాడు. వ్యవసాయాధికారులు చెప్పినట్టుగానే వడ్లను శుభ్రం చేసి కొనుగోలుకు సిద్ధం చేశాడు. కొనుగోలు ఆలస్యం కావడంతో సమ్మయ్య రోజూ ఇల్లు, సెంటర్ మధ్య తిరుగుతూనే ఉన్నాడు. ఇంకెన్ని రోజులు ఇలా చేస్తారని అధికారులపై అసహనం వ్యక్తం చేశాడు. రోజులాగే మంగళవారం మార్కెట్‌కు వెళ్లిన సమ్మయ్య.. తన వడ్లను కొనాలని కోరాడు. అయినా అధికారులు వినలేదు. సంచులు కూడా ఇవ్వలేదు.
మార్కెట్లో పరపతి ఉన్న రైతులు కాంటా పెట్టించుకుంటుండడంతో తన పరిస్థితి ఏమిటని కలత చెందాడు. దీంతో బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే సమ్మయ్యను పక్కకు లాగి ఒంటిపై నీళ్లు పోశారు. తర్వాత మార్కెట్ సెంటర్ నిర్వాహకులు సమ్మయ్య ధాన్యంతో పాటు మరి కొంతమంది రైతుల ధాన్యాన్ని కూడా కొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వర్షాలు పడుతుండడంతో తేమ రావడం లేదని, ధాన్యాన్ని రోజూ ఆరబోస్తూ కుప్పలు పోసుకుంటున్నామన్నారు. సెంటర్ నిర్వాహకులు రైతులపై వివక్ష చూపుతూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొనాలని కోరుతున్నారు.