- సర్కార్ ఆదేశాలిచ్చినా స్పందించని వ్యవసాయశాఖ
- పది రోజులైనా సన్న రకాలు ప్రకటించని అగ్రికల్చర్ ఆఫీసర్లు
- నార్లు పోసుకునేందుకు రైతుల ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో సన్న వడ్ల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇదివరకే సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోనస్ ఇవ్వబోయే సన్న వడ్ల రకాలను వ్యవసాయశాఖ ప్రకటిస్తుందని చెప్పింది. ఈ ప్రకటన వెలువడి పది రోజులవుతున్నా వ్యవసాయశాఖ నుంచి ఇప్పటివరకు ఏఏ రకాలకు సబ్సిడీ ఇవ్వబోతున్నారనే స్పష్టత రాలేదు. ఏ వడ్లు నారు పోసుకోవాలని చెప్పకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది.
వానాకాలం 60లక్షల ఎకరాల్లో వరి సాగు
ఈయేడు వానాకాలంలో 1.32కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 66 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని అనుకుంటోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రైతులు దుక్కులు దున్నుకుని సాగుకు సిద్ధమవుతున్నారు.
కానీ, వ్యవసాయ శాఖ బోనస్ ప్రకటించే సన్నవడ్ల రకాలు ఏమిటో చెప్పకపోవడంతో తికమకపడుతున్నారు. మరోవైపు వరి సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 19 రకాల విత్తనాలను సిద్ధం చేసింది.
ఆ రకాలు ఇవే ..
ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 19 రకాల వరి సన్నగింజ రకాలను అందుబాటులోకి తెచ్చి రైతులకు విక్రయించారు. బి.పి.టి. 5204, డబ్ల్యు.జి.ఎల్-44, డబ్ల్యు.జి.ఎల్ -962, డబ్ల్యు.జి.ఎల్. 1119, డబ్ల్యు.జి.ఎల్.1246, డబ్ల్యు.జి.ఎల్ 1487, ఆర్.డి.ఆర్ 1162, ఆర్.డి.ఆర్ 1200, కె.ఎన్.ఎం 1638, కె.పి.ఎస్. 6251, జె.జి.ఎల్- 28545, జె.జి.ఎల్ 27356, జె.జి.ఎల్ 33124, ఆర్.ఎన్.ఆర్.15435, ఆర్.ఎన్.ఆర్- 2465, ఆర్.ఎన్.ఆర్- 11718, ఆర్.ఎన్.ఆర్. 21278, ఆర్.ఎన్.ఆర్. 29325, ఆర్.ఎన్.ఆర్. 15048 రకాలను రైతులకు అమ్మారు.
ప్రభుత్వం సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడంతో ఈ 19 రకాల విత్తనాలకే ఇస్తారా లేక వేరే ప్రకటన వస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇవి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసినవి కావడంతో ప్రభుత్వం వీటినే సిఫార్సు చేస్తుందన్న ప్రచారం కూడా నడుస్తోంది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.