ధాన్యం కొనుగోళ్లపై ఆగని ఆందోళనలు

ధాన్యం కొనుగోళ్లపై ఆగని ఆందోళనలు
వడ్లు కొంటలేరని, కొన్నవి తీస్కపోతలేరని నిరసనలు 
జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ అన్నదాత ఆత్మహత్యాయత్నం 
వడ్లను కాలబెట్టి ఆగ్రహం 
మెదక్​జిల్లాలోనే నాలుగు చోట్ల రాస్తారోకోలు 
ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్​

రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా వడ్లు కొనడం లేదని, కాంటా పెట్టిన చోట కిలోల కొద్దీ తరుగు తీస్తున్నారని, లారీల కొరత పేరు చెబుతూ ధాన్యం తీసుకుపోవడం లేదని, తామే తీసుకుపోదామంటే మిల్లుల దగ్గర ఐదు రోజుల వరకు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లెక్కారు. జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​లో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోబోగా తోటి రైతులు అడ్డుకున్నారు.

     – వెలుగు, నెట్​వర్క్​

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్​జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లి, మగ్దుంపూర్ గ్రామాల రైతులు దొంతి బస్టాండ్ దగ్గరున్న తూప్రాన్ –నర్సాపూర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. నాలుగు రోజులుగా ధాన్యం తరలించేందుకు లారీలు రావడంలేదని వడ్ల సంచులు పెట్టి 3 గంటల పాటు బైఠాయించారు.  అధికారులు వచ్చి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఇదే మండలంలోని శ్రీ సాయి వెంకటరమణ రైస్ మిల్ దగ్గర తూప్రాన్ -–నర్సాపూర్ రోడ్డుపై కూడా రైతులు రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా వడ్ల ట్రాక్టర్లు పెట్టి నిరసన తెలిపారు. వారం నుంచి లోడ్లు ఖాళీ కావడం లేదని, ట్రాక్టర్ల కిరాయి తడిసిమోపెడవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కిలోమీటర్ల పొడువునా వాహనాలు నిలిచిపోయాయి. బస్సుల్లోని ప్రయాణికులు వచ్చి బతిమిలాడడంతో రాస్తారోకో విరమించారు. లారీల కొరత తీర్చాలంటూ కొల్చారం మండలం రంగంపేటలోని సంగారెడ్డి మెయిన్ రోడ్డు పై అన్నదాతలు బైఠాయించారు. వడ్ల సంచులు తగలబెట్టి నిరసన తెలిపారు. బస్తాకు రూ.10 అదనంగా ఇస్తేనే లారీలు వస్తున్నాయని వాపోయారు.  తరుగు పేరుతో బస్తాకు 4, 5 కిలోల చొప్పున అదనంగా తీసుకుంటున్నారన్నారు. వారం రోజులవుతున్నా వడ్లు కొనడం లేదని జోగిపేట రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. లారీలు రావడం లేదని, అధికారులు ధాన్యాన్ని తూకం వేయడం లేదన్నారు. పోలీసులు, అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

పురుగుల మందు తాగబోయిన రైతు 

వారమవుతున్నా వడ్లు కొనడం లేదని కలత చెంది న ఓ రైతన్న పురుగుల మందు తాగబోయాడు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​కు చెందిన రైతు కామాల్ల వెంకటయ్యతోపాటు, మరో 10 మంది రైతులు స్టేషన్​ఘన్​పూర్​లోని ఆర్టీసీ గ్రౌండ్​లోని కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు. అయినా కొనడం లేదు. ఈ కేంద్రానికి అటాచ్​ చేసిన జనగామలోని రైస్​ మిల్లులో వడ్లను ఇన్​టైంలో దింపుకోకపోవడంతో 3 రోజులుగా లారీలు బందయ్యాయి. దీంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు.  మనస్తాపానికి గురైన కామాల్ల వెంకటయ్య అనే రైతు తన వడ్ల కుప్ప దగ్గర పురుగుల మందు తాగబోయాడు. గమనించిన తోటి రైతులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో వడ్ల బస్తాలను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. నిర్వాహకులు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడంతో శాంతించారు.  

నల్గొండ జిల్లాలో...

వడ్లు కొనాలంటూ నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు స్టేజీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పులిచర్ల, పోతునూరు గ్రామాలకు చెందిన అన్నదాతలు నాగార్జునసాగర్- హైదరాబాద్ హైవేపై రాస్తారోకో చేశారు. గంటకు పైగా నిరసన తెలపడంతో వాహనాలు నిలిచిపోయాయి. రైతులు మాట్లాడుతూ ఐకేపీ సెంటర్​లో వడ్లు పోసి వారమవుతున్నా  కాంటాలు వేయడం లేదని, కాంటాలు వేసిన తర్వాత తీసుకువెళ్లేందుకు లారీలు రాకపోవడంతో  ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి వచ్చి వడ్లు కొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

6 కిలోల తరుగు తీస్తున్నరని.. 

కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మకై 6 కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్​ జిల్లా నందిపేట మండలంలోని శాపూర్ లో రైతులు రాస్తారోకో చేశారు. సొసైటీ చైర్మన్ ​వచ్చి సమాధానం చెప్పేంత వరకు కదిలేది లేదని రోడ్డుపైనే కూర్చున్నారు. పోలీసులు వచ్చి ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ.. 

వైరా మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలంటూ గొల్లపూడి సెంటర్​లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గొలైన్ పాడు, గొల్లపూడి, అష్ణగుర్తి రైతులు అందోళన చేశారు. రైతులు మాట్లాడుతూ ఆరు గ్రామాల్లో వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశామని, కొనుగోలు కేంద్రం లేక తిప్పలు పడుతున్నామన్నారు. కలెక్టర్​కు చెప్తే  కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారని, అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ​కలెక్టర్​ మధుసూదనరావు, మార్క్ ఫెడ్ డీఎం సునీత శనివారంలోగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు