కామారెడ్డిలో మూడో రోజు రైతుల ఆందోళనలు

కామారెడ్డి : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా 3వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతతో రేవంత్ రెడ్డి పర్యటన డైలమా లో ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకు రైతులను కలెక్టర్ కలవలేదు. 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న ఆందోళనతో సదాశివనగర్​మండలం అడ్లూర్​ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాములు కుటుంబాన్ని బండి సంజయ్ నిన్న పరామర్శించారు. మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు.

అనంతరం రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా కలెక్టరేట్ ను బండి సంజయ్ ముట్టడించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు, బీజేపీ కార్యకర్తలు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి కిందపడిపోయారు.చివరకు పోలీసులు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. 

రైతుల పోరాటానికి అండగా ఉంటామని, మాస్టర్ ప్లాన్​ను రద్దు చేసేంత వరకూ ఉద్యమిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఇండస్ట్రియల్ జోన్​కు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ దాని కోసం ఏడాదికి రెండు పంటలు పండే భూములను లాక్కోవడం సరికాదన్నారు. 

బంద్ సక్సెస్..    

మాస్టర్ ప్లాన్​కు వ్యతిరేకంగా, కలెక్టర్​ తీరుకు నిరసనగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన కామారెడ్డి బంద్ సక్సెస్ ​అయింది. పట్టణంలోని దుకాణాలు, సినిమా హాల్స్, హోటళ్లు, ప్రైవేట్​ విద్యాసంస్థలను మూసేశారు. బంద్​కు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాయి. పట్టణ శివార్లలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన పోలీసులు.. వివిధ గ్రామాల నుంచి కామారెడ్డికి వస్తున్న రైతులు, బీజేపీ, కాంగ్రెస్ ​లీడర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బంద్​ సందర్భంగా రైతులు, బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన 170 మంది నేతలను అరెస్టు చేశారు.