ఘట్కేసర్, వెలుగు: వడగండ్లు, ఆకాల వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనాలని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామ రైతులు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొంటామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే చెప్పినా అధికారులు, రైస్ మిల్లర్లు మాత్రం కొనడంలేదన్నారు.
అధికారికంగా తమకు ఉత్తర్వులు రాలేదంటున్నారని వాపోయారు. అకాల వర్షాలకు ఇప్పటికే తీరని నష్టం వాటిల్లిందని, ఈ ధ్యాన్యం కొనకపోతే నిండా మునుగుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగుమారిన ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. నిరసనలో రైతులు జిల్లాల రాజశేఖర్రెడ్డి, మర్రిపల్లిగూడ ఉప సర్పంచ్ మాయ నరేశ్, మల్లేశ్, సాయిలు పాల్గొన్నారు.