నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్వడ్ల కొనుగోలు షురువైన నేపథ్యంలో కడ్తా దోపిడీ మళ్లీ తెరపైకి వచ్చింది. 9 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా జిల్లాలో 467 సెంటర్లు తెరిచి కాంటాలు పెట్టారు. గవర్నమెంట్ప్రకటించిన మద్ధతు ధర, బిల్లలు చెల్లింపుపై నమ్మకంతో రైతులు కాంటాలు ఆశ్రయిస్తారు. సింగిల్‌విండో పాలకులు, రైస్‌మిల్లర్లు కలిసి కడ్తా (తరుగు) పేరుతో రైతులను దోపిడీ చేసే ప్లాన్అమలు చేస్తున్నారు. ఈ విషయంలో కన్నెర్ర చేసిన మోర్తాడ్రైతులు శనివారం ఆందోళనకు దిగారు.
చర్యలకు డిమాండ్..
సర్కారు నిబంధనలు పాటించకుండా తమను దోపిడి చేసే రీతిలో తరుగు తీస్తున్నారని.. గతేడాది ఇదే రీతిలో రూ.లక్షలు నష్టపోయామని రైతులు మండిపడ్డారు. జిల్లా అధికారులు వచ్చి
సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించారు. మధ్యాహ్నం అక్కడే కూర్చొని వంటావార్పు చేశారు. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లు.. గతేడాది తాలూకు నష్టాన్ని పరిశీలించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. తహసీల్దార్బాబయ్య వచ్చి ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపానని శని, ఆదివారాలు సెలవు ఉన్నందున సోమవారం డీసీవో సింహాచలం వస్తారని.. అన్ని విషయాలు తేలుతాయని నచ్చజెప్పడంతో ఆందోళన
విరమించారు.
తాళం వేసి ఆందోళన..
వడ్ల కొనుగోలు ప్రారంభించాక ఇప్పటి వరకు సుమారు 5 లోడ్ల ధాన్యాన్ని సేకరించారు. నిబంధనల ప్రకారం బస్తాకు 40 కిలోలను మాత్రమే జోకాల్సి ఉండగా కిలోన్నర ఎక్కువ తీసుకున్నారు. అయినా రైతులు ఒప్పుకున్నారు. మిల్లర్అదనంగా మరో కిలోన్నర కడ్తా ఇస్తేనే లారీ లోడ్ ఖాళీ చేస్తానని షరతు పెడుతున్నాడని కార్యదర్శి కాశీరాం రైతులకు ఫోన్లో చెప్పారు. క్వింటాల్వడ్లు మిల్లింగ్ చేస్తే 67 శాతం రావాల్సిన బియ్యం 62 శాతం వస్తున్నట్లు మిల్లర్ చెబుతున్నాడని, అందుకే తరుగు పెంచాడని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. చైర్మన్ అశోక్‌రెడ్డి, కార్యదర్శి కాశీరాంను విండో కార్యాలయంలోకి వెళ్లాక బయటకు రానీయకుండా గేటుకు తాళం వేశారు.
ఆఫీసర్లు స్పందించకుంటే రోడ్డెక్కుతాం..
నేను 5 ఎకరాల్లో వరి పంట వేసి 426 బస్తాలను కాంటా వేయించిన. అప్పటికే కిలోన్నర కడ్తా తీసుకున్నా పోనీలే అనుకున్నా. ఇప్పడు మరో కిలోన్నర తరుగు ఇస్తేనే లారీ ఖాళీ చేస్తామని అంటుర్రు.. ఎట్టి కష్టం పడితే నాలుగు గింజలు చేతికొచ్చినయ్. దీంట్ల కూడా కడ్తా అంటే ఎట్లా.
శేఖర్, రైతు, మోర్తాడ్
మాకేం మిగుల్తది..
ఎకరన్నర భూమిలో వరి వేయగా 90 బస్తాల దిగుబడి వచ్చింది. సాదాసీదా చిన్న రైతును కిలోన్నర తరుగు తీసినా పట్టించుకోలే. మరీ దారుణంగా ఇంకో కిలోన్నర ఇయ్యమంటుర్రు.. పంటసాగు పెట్టుబడి కష్టం పోనూ మిగిలేది ఏమీ లేదు. చివరకు అమ్మే సమయంలో ఈ దోపిడీ. ఇట్లయితే బతుకుడు ఎట్లనో అర్థమైతలేదు. గణేశ్, రైతు, మోర్తాడ్