వాగు పొంగితే మునిగిపోతాం..!

వాగు పొంగితే మునిగిపోతాం..!
  • కబ్జాల నుంచి కాపాడండి.. 
  • హన్మకొండ జిల్లా పంథిని రైతులు, గ్రామస్థుల ఆవేదన

వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు: హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామ శివారులోని వాగు కబ్జాకు గురవుతున్నదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జా, వాగు విస్తీర్ణం నిర్ధారణ, బఫర్ జోన్ ఖరారుపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కబ్జాల కారణంగా వాగు పొంగితే తమ పంట పొలాలు మునిగిపోతాయని వాపోతున్నారు.

వాగుకు ఎడమ వైపు ఒక తోట ఉండగా, కుడివైపు ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నారని తెలిపారు. ఎకరంన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు వాగు విస్తీర్ణాన్ని కుదిస్తున్నారన్నారు. దీనిపై 2024 నవంబర్​లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు ఫిర్యాదు చేసినా ఎమ్మా ర్వో పట్టించుకోలేదని వాపోయారు. ఇటీవల ఆర్ఐని సంప్రదించగా, సర్వే చేయడానికి వెళ్తే తోట యజమాని, ఫంక్షన్ హాల్ ఓనర్లు సహకరించలేదన్నారు.

ఓనర్ల నుంచి సహకారం లేకపోతే ఏమీ చేయలేమని, అందువల్లే పని పెండింగ్​లో పెట్టినట్లు ఆర్ఐ చెప్పినట్లు తెలిపారు. ఇలా పరస్పరం నెపం వేసుకుంటూ ఆఫీసర్లు తప్పించుకుంటున్నారని, ఇదే విషయాన్ని తాజాగా కలెక్టర్​కు ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వాగుకు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.