సూర్యాపేట, నల్గొండ అర్బన్, హుజూర్ నగర్, తుంగతుర్తి, వెలుగు: నిరంకుశంగా కాల్పులు జరిపి యువ రైతు మృతికి కారణమైన హర్యానా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రైతు, కార్మిక సంఘాలు, లెఫ్ట్ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్, ఎస్కేఎం, ప్రజా పంథా, పీవోడబ్ల్యూ, పీడీఎస్‌యూ, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రధాని మోదీ, హర్యానా సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో పంటలకు మద్దతు ధర కల్పించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు కాల్పులు జరపడం దారుణమన్నారు. ఈ కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన 24 ఏండ్ల యువకుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను హత్యా నేరం కింద అరెస్టు చేయడంతో పాటు ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు విద్యుత్ సవరణ బిల్లు, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నేతలు ఇందూరు సాగర్, బీరెడ్డి సత్తిరెడ్డి, వెంకన్న, కొత్తపల్లి రేణుక, ఎర్ర అఖిల్, వక్కవంతుల కోటేశ్వరరావు, యల్లావుల రాములు, కంబాల శ్రీనివాస్, కొప్పోజు సూర్యనారాయణ, బుర్ర శ్రీనివాస్, బొమ్మిడి నగేశ్, బీవీచారి, అక్కినపల్లి అంజి, బోగరాజు రమేశ్, క్రాంతి, బేజికంటే శంకర్, బొమ్మపాల అశోక్, యాదగిరి, లింగయ్య పాల్గొన్నారు.