ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. సామాన్యులతో సహా రాజకీయ వర్గాలు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన మేనిఫెస్టోను సుదీర్ఘ కసరత్తు తర్వాత ఇవాళ ప్రకటించాడు జగన్.2019 ఎన్నికల్లో ప్రకటించిన పథకాలకు పెద్దగా మార్పులు చేయకుండా వాటి ద్వారా అందించే నగదును పెంచారు. ప్రస్తుతం 3వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ ను రెండు దఫాలుగా 3వేల 500రూపాయలకు ( 2028 జనవరిలో 250, 2029 జనవరిలో 250) పెంచుతామని ఇచ్చాడు జగన్. ఒకరకంగా ఇది పెన్షనర్లను నిరాశ పరిచే అంశమని చెప్పాలి. ప్రస్తుతం రూ.13500గా ఉన్న రైతు భరోసాను 16వేలకు పెంచుతామన్నారు జగన్.
Also Read:9 ముఖ్యమైన హామీలతో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో
చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలతో పోల్చి చూస్తే వైసీపీ మేనిఫెస్టో రైతులు, పెన్షనర్లకు నిరాశాజనకంగానే అనిపిస్తోంది. సూపర్ 6లో పెన్షన్ 4వేలకు పెంచి, రైతులకు ఏటా 20వేల రూపాయలు ఇస్తానని అంటున్నారు చంద్రబాబు.ఈ క్రమంలో చంద్రబాబు సూపర్ 6ని రైతులు, పెన్షనర్లు సీరియస్ గా తీసుకుంటే మాత్రం వైసీపీకి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. మేనిఫెస్టో ప్రకటన సందర్బంగా కానీ, బహిరంగ సభల్లో కానీ సాధ్యపడని హామీలు ఇవ్వను, చేయలేనివి చెప్పి చంద్రబాబులా మోసం చేయను అని జగన్ అంటున్న మాటలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.
ఇదే సమయంలో సీఎం జగన్ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం అమలు అవుతున్న అన్ని పథకాలను ఎవరు వచ్చినా కొనసాగించాల్సిందే అని.. ఈ విషయం చంద్రబాబు కూడా చెబుతున్నాడని వివరించారు. అలాంటప్పుడు ప్రస్తుతం అమలు అవుతున్న పథకాలకే ఏడాదికి 70 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. మరి చంద్రబాబు హామీలకు లక్షా 50 వేల కోట్లు ఖర్చవుతుందని స్పస్టం చేశారు. 70 వేల కోట్లకే చాలా కష్టంగా ఉందని.. అలాంటప్పుడు మొత్తం రాష్ట్ర బడ్జెట్ లక్షా 50 వేల కోట్లను పథకాలకే ఎలా ఖర్చు చేయగలరని.. ఈ విషయాన్ని ప్రజలు అందరూ ఆలోచించాలని కోరారు.మరో విషయాన్ని కూడా స్పష్టం చేశారు జగన్. ఇలాంటి హామీలనే చంద్రబాబు 2014, 2019లోనూ ఇచ్చారని.. 2014లో కూడా రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల అప్పులు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని విషయాన్ని స్పష్టంగా వివరించారు జగన్.